Sunita Williams May Have To Stay In Space Till February Next Year : మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సాంకేతిక కారణాలతో నెలల తరబడి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లోనే ఉండనున్నారు.
సునీత, విల్‌మోర్ జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. జూన్ 14న వారు భూమికి తిరిగి రావాల్సింది. అయితే, వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో 2 నెలలుగా వీరిద్దరూ ఐఎస్‌ఎస్‌లోనే ఉండిపోయారు. దీనితో ఈ వ్యోమగాముల రాకపై అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా తాజాగా ఒక ప్రకటన చేసింది.
‘‘బోయింగ్ స్టార్‌లైనర్ తిరిగి భూమ్మీద సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అవకాశం లేకపోతే, ప్రత్యామ్నాయంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకతో వెనక్కి రప్పించే వీలుంది. 2025 ఫిబ్రవరిలో అందుకు అవకాశం కుదురుతుంది’’ అని నాసా పేర్కొంది. ఈ లెక్కన అప్పటి వరకూ సునీత, విల్‌మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్పేస్‌ఎక్స్ క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను ఈ ఏడాది సెప్టెంబరులో ప్రయోగించే వీలుంది. ఈ వ్యోమనౌకతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్‌మోర్‌ను భూమి మీదకు తీసుకురావాలని నాసా ప్రణాళికలు వేస్తోంది. వారిని స్టార్‌లైనర్‌లోనే తీసుకురావాలా? లేక క్రూ డ్రాగన్‌ను ఉపయోగించాలా? అన్నదానిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.