Sri Lanka Presidential Election 2024 :రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న పొరుగు దేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆర్థిక మాంద్యం ప్రభావం నుంచి తమను కాపాడే నాయకుడిని లంకేయులు శనివారం ఎన్నుకోనున్నారు. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రణిల్ మిక్రమసింఘే(75) స్వంతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు సింఘే చేసిన ప్రయత్నాలు విజయం సాధించాయని, ఇది ఇంతకుముందు సంక్షోభం నుంచి అతి త్వరగా కోలుకున్న ఆర్థిక వ్యవస్థల్లో శ్రీలంక ఒకటని నిపుణులు ప్రశంసించారు. ఈ ధీమాతోనే తనను మళ్లీ ఐదేళ్ల కాలానికి అధ్యక్షుడిగా గెలిపించాలని సింఘే కోరుతున్నారు.
సంస్కరణల ధీమాతో రణిల్ విక్రమసింఘే!
సంక్షోభ సమయంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎమ్ఎఫ్) బెయిల్ ఔట్ ప్యాకేజీతో ముడిపడిన కఠినమైన సంస్కరణలను సింఘే అమలు చేశారు. దీంతో వరుసగా రెండు త్రైమాసికాల నెగెటివ్ గ్రోత్ నుంచి శ్రీలంక కోలుకోవడానికి సహాయపడింది. ఇక తాము ప్రవేశపెట్టిన ఇలాంటి సంస్కరణలతో ముందుకు సాగడం వల్ల దేశం దివాలా తీయకుండా తాను చూసుకుంటానని బుధవారం ప్రజలకు సింఘే హామీ ఇచ్చారు.
త్రిముఖ పోరు
ఈసారి శ్రీలంకలో త్రిముఖ పోరు నెలకొంది. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల చరిత్రలో త్రిముఖ పోటీ ఇదే తొలిసారి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విక్రమ సింఘే కాకుండా, నేషనల్ పీపుల్స్ వపర్కు(ఎన్పీపీ) చెందిన అనుర కుమార దిసనాయకే(56), సమగి జన బలవేగయ(ఎస్జేబీ) పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస(57) పోటీలో ఉన్నారు. అయితే ఈ ముగ్గురికి 2020లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిందని, ఈ ఎన్నికలు క్రితం సారి కంటే భిన్నవైనవని అని విశ్లేషకులు కుషల్ పెరీరా తెలిపారు.