SpaceX Starship Record Breaking Feat : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్‌ఎక్స్' సంస్థ అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఆ సంస్థ తాజాగా ప్రయోగించిన భారీ 'స్టార్‌షిప్' రాకెట్ బూస్టర్ నింగిలోకి దూసుకెళ్లి, ఆ తర్వాత లాంచ్‌ప్యాడ్ (లాంచ్‌టవర్) వద్దకు సురక్షితంగా చేరుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతం అంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. స్పేస్ఎక్స్ తాజా ప్రయోగంలో భాగంగా, టెక్సాస్‌లో మెక్సికో సరిహద్దుకు సమీపం నుంచి ఆదివారం ఉదయం రెండు దశల (బూస్టర్, వ్యోమనౌక) స్టార్‌షిప్ రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఆ రాకెట్ పొడవు 121 మీటర్లు. అందులోని బూస్టర్ పొడవు 71 మీటర్లు. నింగిలోకి ఎగిరిన 7 నిమిషాల తర్వాత బూస్టర్ క్రమంగా కిందకు దిగుతూ లాంచ్‌టవర్‌కు సురక్షితంగా తిరిగొచ్చింది. చాప్‌స్టిక్స్‌లా పనిచేసే తన భారీ మరహస్తాలతో లాంచ్‌టవర్ దాన్ని పదిలంగా ఒడిసిపట్టుకుని చరిత్ర సృష్టించింది. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తవగానే స్పేస్‌ఎక్స్ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మరోవైపు స్టార్‌షిప్ రాకెట్‌తో నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక తన ప్రయాణాన్ని కొనసాగించి, హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది. ఈ విధంగా స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది.
చంద్రునిపైకి సరకుల రవాణా
వాస్తవానికి స్పేస్‌ఎక్స్ సంస్థ తమ బూస్టర్లను తిరిగి సేకరించడం కొత్తేమీ కాదు. ఫ్లోరిడా లేదా కాలిఫోర్నియా నుంచి నింగిలోకి దూసుకెళ్లి, ఉపగ్రహాలను, వ్యోమగాములను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత భూమికి తిరిగొచ్చే ఫాల్కన్-9 రాకెట్ బూస్టర్లను 9 ఏళ్లుగా స్పేస్ఎక్స్ సంస్థ రికవరీ చేస్తూనే ఉంది. అయితే మహాసముద్రాల్లో ఏర్పాటు చేసిన తేలియాడే ప్లాట్‌ఫామ్‌లపై లేదా కాంక్రీటు స్లాబ్‌లపై మాత్రమే అవి ల్యాండ్ అయ్యేవి. అయితే ఆ ప్లాట్‌ఫామ్‌లు లాంచ్‌ప్యాడ్‌లకు అనేక మైళ్ల దూరంలో ఉంటాయి. కానీ రాకెట్ బూస్టర్ నేరుగా లాంచ్‌ప్యాడ్‌కే తిరిగిరావడం మాత్రం ఇదే తొలిసారి. ఫాల్కన్ బూస్టర్లను రీసైక్లింగ్ చేయడం ద్వారా స్పేస్‌ఎక్స్ తన ప్రయోగాల వేగం పెంచింది. ఈ విధంగా మిలియన్ డాలర్ల మేర డబ్బును ఆదా చేసుకుంది. స్టార్‌షిప్ రాకెట్ల విషయంలోనూ అలాగే చేయాలని ఎలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నారు. స్టార్‌షిప్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తిమంతమైన రాకెట్. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి వ్యోమగాములను, అవసరమైన సరకులను పంపించేందుకు స్టార్‌షిప్ రాకెట్‌ను ఉపయోగించుకోవాలని స్పేస్‌ఎక్స్ ప్రణాళికలు వేస్తోంది.