Solar Storm 2024 : రెండు దశాబ్దాలలో చూడని శక్తిమంతమైన సౌరతుపాను భూమిని తాకింది. దీనివల్ల పుడమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణం గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనిస్థాయిలో ప్రభావితమైంది. ఫలితంగా భారత్‌లోని లద్దాఖ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశంలో అరోరాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కొన్నిచోట్ల విద్యుత్ గ్రిడ్లకు, కమ్యూనికేషన్, ఉపగ్రహ పొజిషనింగ్ వ్యవస్థల్లో స్వల్ప అవరోధాలు ఏర్పడ్డాయి. కానీ, పెద్ద ఇబ్బందులేమీ తలెత్తలేదు. ఆదివారం కూడా ఇవి కొనసాగుతాయని అమెరికాలోని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) పేర్కొంది.
రంగు రంగుల్లో ఆకాశం
ఉత్తర ఐరోపా నుంచి ఆస్ట్రేలియా వరకు ఆకాశం రంగు రంగుల్లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. నార్తర్న్ లైట్స్‌ను చూసేందుకు జనం ఎగబడ్డారు. ఆ లైట్స్ కంటికి నేరుగా కనిపించినట్లు బ్రిటన్‌లో స్థానికులు చెప్పారు. టాస్మానియాలో మాత్రం శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆకాశంలో ఆరోరాలు దర్శనమిచ్చాయి. లద్దాఖ్‌లోని హాన్లే డార్క్ స్కై రిజర్వు ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆకాశం అరుణ వర్ణపు శోభను సంతరించుకుంది.
తాజా సౌర తుపానుకు సౌరగోళంలోని ఏఆర్13664 అనే ప్రాంతంలో ఏర్పడ్డ ఒక సౌరమచ్చ కేంద్రంగా ఉంది. సౌర తుఫాన్ వల్ల అయస్కాంత క్షేత్రంలో మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయని, అందుకే శాటిలైట్ ఆపరేటర్లు, ఎయిర్‌లైన్స్, పవర్ గ్రిడ్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కరోనాల్ మాస్ ఎజెక్సన్స్ సూర్యుడి నుంచి వెలుబడ్డనట్లు నేషనల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. అయితే సౌర తుఫాన్ తీవ్రంగా ఉండటం వల్ల ఎక్స్‌ట్రీమ్ జియోమాగ్నిక్ స్టార్మ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని కరోనాల్ మాస్ ఎజెక్సన్స్ భూమిని తాకే అవకాశాలు ఉన్నట్లు హెచ్చరించారు.