తెలంగాణ

telangana

ETV Bharat / international

హమాస్‌ అగ్రనేత యాహ్యా సిన్వర్‌ హతం- ఇజ్రాయెల్​ శత్రువులంతా అంతమైనట్లే! - SINWAR HAMAS DEAD

హమాస్‌ అధినేత యహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌ దళాలు- సంచ‌ల‌నం సృష్టించిన ట్రైనీస్​!

Sinwar Hamas Dead
Sinwar Hamas Dead (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2024, 6:40 AM IST

Sinwar Hamas Dead : గాజాతో యుద్ధంలో ఇజ్రాయెల్‌ అతిపెద్ద విజయం సాధించింది. అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్‌ మిలిటెంట్‌ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను హతమార్చింది. ఈ విషయాన్ని గురువారం ఇజ్రాయెల్‌ విదేశాంగమంత్రి కాంట్జ్‌ ధ్రువీకరించారు. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయమని తెలిపారు. ఇరాన్‌ నేతృత్వంలో రాడికల్‌ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయమిది అని అన్నారు. సిన్వర్‌ ఏరివేతతో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుందిని పేర్కొన్నారు. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశామని అయితే యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని తెలిపారు. ఇక ఎంత మాత్రం గాజాను హమాస్‌ నియంత్రించలేదని అన్నారు. తమ నాయకుడి మరణంపై హమాస్‌ ఇంకా స్పందించలేదు. అయితే కీలక నేతలంతా హతమైన వేళ సిన్వర్‌ మృతి హమాస్‌కు భారీ దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు.

దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్‌ మిలిటెంట్లను ఇజ్రాయెల్‌ సైన్యం (ఐడీఎఫ్‌) హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్‌ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్‌, డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి హమాస్‌ నేత మరణాన్ని ధ్రువీకరించుకుంది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 మారణహోమానికి సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్‌ బలంగా విశ్వసిస్తోంది. గతేడాది ఇజ్రాయెల్‌ సరిహద్దులపై హమాస్‌ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్‌ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఏడాదిగా సిన్వర్‌ కోసం గాజా సొరంగాల్లో ఐడీఎఫ్‌ వేట కొనసాగిస్తోంది. కొన్ని సార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడని పలుమార్లు పేర్కొంది. తనను ఇజ్రాయెల్‌ హతమార్చకుండా బందీల మధ్య సిన్వర్‌ తల దాచుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు కూడా ఇటీవల పేర్కొన్నాయి. అయితే బుధవారం తాము నిర్వహించిన దాడిలో మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బందీల మధ్యలో లేరని ఐడీఎఫ్‌ వివరణ ఇచ్చింది. బందీలకు ఎలాంటి హాని జరగలేదని పేర్కొంది. హమాస్‌ అగ్రనేత మృతికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ఇజ్రాయెల్‌ షేర్ చేసుకుంది.

సిన్వర్‌ మృతి ప్రపంచానికి మంచిరోజు
ఉగ్రసంస్థ హమాస్‌ అగ్రనేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్‌ దళాలు మట్టుబెట్టడం ఆ దేశం, తమ దేశంతో పాటు యావత్‌ ప్రపంచానికి శుభదినమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు. ఈ ఘటన హమాస్‌ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధ పరిసమాప్తికి బాటలు వేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అల్‌ఖైదా అధినేత, సెప్టెంబరు 11, 2001 దాడుల సూత్రధారి ఒసామా బిన్‌ లాడెన్‌ను అంతమొందించిన ఘటనతో తాజా ఘటనను పోల్చారు. సిన్వర్‌ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అయిందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పేర్కొన్నారు.

ఇజ్రాయెల్‌ సైనికులకు సెల్యూట్‌ చేసిన డిఫెన్స్‌ మినిస్టర్‌
హమాస్‌పై కీలక విజయం సాధించడం వల్ల ఇజ్రాయెల్‌ రక్షణశాఖ మంత్రి యోవ్‌ గ్యాలంట్‌ సైనికులకు సెల్యూట్‌ చేశారు. సిన్వర్‌ మృతితో గాజా వాసులకు స్పష్టమైన సందేశం వెళ్లిందన్నారు. గాజా స్ట్రిప్‌లో ప్రజలు ఇబ్బందులు పడటానికి అతడి హంతక చర్యలే కారణమన్నారు. అయితే వేలాదిమంది ఇజ్రాయెల్ సైనికులు, డ్రోన్లు, నిఘావ‌ర్గాలు సంవ‌త్సరకాలంగా య‌త్నించినా క‌నీసం సిన్వర్ ఎక్కడవున్నాడన్న ఆచూకీ క‌నిపెట్టలేకపోయారు. అయితే ఇజ్రాయెల్ ట్రైనీ సైనికులు సిన్వర్‌ను మ‌ట్టుబెట్టడం సంచ‌ల‌నం సృష్టించింది.

ABOUT THE AUTHOR

...view details