తెలంగాణ

telangana

ETV Bharat / international

న్యూఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి! జనంపైకి దూసుకెళ్లిన కారు- 15 మంది మృతి - CAR INCIDENT US

అమెరికాలో ఘోరం- జనంపైకి దూసుకెళ్లిన కారు- 15 మంది మృతి, 30 మందికి గాయాలు

Car Incident US
Car Incident US (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2025, 5:29 PM IST

Updated : Jan 1, 2025, 9:28 PM IST

అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో కొత్త సంవత్సర వేడుకలు విషాదాన్ని మిగిల్చింది. ఓ దుండగుడు తన వాహనంతో (పికప్‌ ట్రక్‌) బీభత్సం సృష్టించి 15 మంది మృతికి కారణమయ్యాడు. మరో 30 మందిని గాయపరిచాడు. అయితే పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై ఉగ్ర చర్య కోణంలో అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ విచారణ జరుపుతోంది. దుండగుడిని టెక్సాస్‌కు చెందిన షంషుద్దీన్‌ జబ్బార్‌గా(42) గుర్తించారు. అతడు అమెరికా పౌరుడేనని పోలీసులు. అంతేకాకుండా అతడి వాహనంలో ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ జెండా లభించిందని పేర్కొన్నారు.

ఏం జరిగిందంటే?
ప్రపంచంలోనే కొత్త సంవత్సర వేడుకలకు ప్రసిద్ధి చెందిన న్యూఆర్లీన్స్‌లోని బార్బన్‌ వీధిలో జరిగిందీ ఘటన. ప్రతి ఏడాదిలాగే ఈ సారీ కూడా ఈ వేడుకలను వీక్షించేందుకు వేలాది మంది తరలి వచ్చారు. అయితే బుధవారం సాయంత్రం అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. చాలా మంది మ్యాచ్​ను చూసేందుకు ఆ ప్రాంతానికి ముందుగానే వచ్చారు.

అయితే బుధవారం తెల్లవారుజామున 3.15 సమయంలో వారందరూ సంబరాల కోసం రోడ్డుపై ఉన్నప్పుడు దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లాడు. దీంతో అక్కడివారంతా చెల్లాచెదురయ్యారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటి వరకూ 15 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారని తెలుస్తోంది. అయితే దాడి తర్వాత ఆ దుండగుడు కాల్పులకు తెగబడగా, ఘటన గురించి తెలుసుకుని వెంటనే స్పందించిన పోలీసులు అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. దీంతో దుండగుడు హతం కావడంతో పాటు కాల్పులు జరిపిన ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

మరోవైపు దాడి కారణంగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరిగే స్టేడియాన్ని బుధవారం ఉదయం మూసివేశారు. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స కోసం 5 ఆసుపత్రులకు తరలించారు. అందులో ఇద్దరు ఇజ్రాయెలీలు ఉన్నారని తెలుస్తోంది.

ఉగ్ర దాడేనా?
ఇదిలా ఉండగా, ఈదాడిపై వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలుత పరస్పర విరుద్ధ వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే అది ఉగ్ర దాడేనంటూ న్యూ ఆర్లీన్స్‌ మేయర్‌ లాటోయా కాంట్రెల్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని పోలీస్‌ చీఫ్‌ అభిప్రాయపడ్డారు.

మరోవైపు దీన్ని ఉగ్ర దాడి కాదంటూ ఎఫ్‌బీఐ అధికారి అలెతియా డంకన్‌ మొదట పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన కూడా దీన్ని ఉగ్ర కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో దుండగుడు పేలుడు పదార్థాలతో వచ్చినట్లు అనుమానించి ఘటనా స్థలంలో సోదాలు జరుపుతున్నారు.

"రక్తపాతం సృష్టించడానికి దుండగుడు తన వాహనంతో వచ్చాడు. అయితే ఉద్దేశపూర్వకంగానే అతడు ఈ దాడికి పాల్పడ్డాడు. సాధ్యమైనంత ఎక్కువ మందిని చంపాలని చూశాడు" అని పోలీస్‌ కమిషనర్‌ అన్నే కిర్క్‌ప్యాట్రిక్‌ తెలిపారు. ఇక కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు పోలీసుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతమయ్యాడంటూ పేర్కొన్నారు.

అయితే ఈ ఘటనపై ఉగ్ర కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చెప్పుకొచ్చారు. ప్రతి అంశాన్నీ పరిశీలించి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ తన సిబ్బందిని ఆదేశించానని ఆయన పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన వారు ఇలా విగత జీవులుగా మారిన తీరు తన హృదయం బరువెక్కించిందని వెల్లడించారు. ఇకపై ఎటువంటి హింసనూ సహించేది లేదంటూ ఆయన స్పష్టం చేశారు.

Last Updated : Jan 1, 2025, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details