Putin Nuclear Weapons :రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధం అణు యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ప్రస్తుత పరిస్థితులను మరింత సంక్షోభంలోకి నెట్టాయి. అమెరికా నిర్ణయంతో గుర్రుగా ఉన్న రష్యా తమ అణు సిద్ధాంతాలను తాజాగా సవరించింది. సవరించిన కొత్త అణు సిద్ధాంతాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా ఏ క్షణమైనా అణ్వాధాయులను ప్రయోగించే అవకాశం ఉందనే భయాందోళనలు నెలకొన్నాయి.
1000 రోజుల యుద్ధం - ఇంకా పూర్తి కాలేదు!
ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ మొదలుపెట్టి 1000 రోజులు పూర్తయిన వేళ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే, దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. తాము అందించే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన వేళ పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.