Russia Drone Attack On Ukraine : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్స్, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపై ప్రయోగించింది. సోమవారం తెల్లవారుజామున కీవ్‌లో అనేక వరుస పేలుళ్లు సంభవించాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది.
శిథిలాల పడి ఒకరికి గాయాలు
కీవ్‌లోని హోలోసివ్స్కీ, సోలోమియాన్స్కీ జిల్లాలకు అత్యవసర సేవలను రప్పించినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్ ష్కో తెలిపారు. షెవ్చెంకివ్స్కీ జిల్లాలో శిథిలాలు పడటం వల్ల ఒకరు గాయపడినట్లు వెల్లడించారు. మరోవైపు, ప్రతిదాడికీ తిరిగి సమాధానం ఉంటుందని, శత్రువు తప్పకుండా దాన్ని స్వీకరించాల్సి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ తన టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఖార్కివ్పైనా క్షిపణి దాడులు
10కి పైగా క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్స్‌తో రష్యా దాడులకు పాల్పడిందని కీవ్ నగర సైనిక పరిపాలనా అధిపతి సెర్హా పాప్కో తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో కూడా పేలుడు సంభవించిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఖార్కివ్ ప్రాంత అధిపతి ఒలేహ్ సినీహుబోవ్ ధ్రువీకరించారు. ఖార్కివ్‌లోని ఇండస్ట్రియల్ని జిల్లాపై సోమవారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఈ దాడి వల్ల ఒక నివాస భవనం, అనేక ఇతర నివాస సముదాయాలకు నిప్పంటుకుందని చెప్పారు.