Putin On Joe Biden : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ రెండోసారి గెలవాలని రష్యా ఆకాంక్షించింది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ నెగ్గాలని, ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆయన కాస్త మేలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారితో కలిసి తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు రష్యా అధినేత. కానీ, మాస్కో కోణంలో చూస్తే మాత్రం బైడెన్ మళ్లీ గెలవాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు. అంతేగాక జో బైడెన్ అనుభవం, అంచనావేయగల నేత అని పుతిన్ కొనియాడారు.
'ఆయన విధానాలు చాలా బలంగా ఉంటాయి'
మరోవైపు అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించారు పుతిన్. తాను వైద్యుణ్ని కాదని, ఈ విషయంలో తాను వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. అమెరికా ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ ఇలాంటి విమర్శలు తీవ్రరూపం దాలుస్తున్నాయన్నారు. బైడెన్ విధానాలు చాలా బలంగా ఉంటాయని పుతిన్ ప్రశంసించారు. అయితే కొన్ని విషయాల్లో వారి వైఖరుల్లో చాలా లోపాలుంటాయని అన్నారు. ఆ విషయాలను తాను స్వయంగా ఆయనకు తెలిపానని చెప్పారు.
"2021లో బైడెన్‌ను నేను స్విట్జర్లాండ్‌లో కలిశాను. అప్పుడు కూడా ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, అప్పటికీ ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. అయితే అందరూ పేపర్‌లో చూస్తూ మాట్లాడతారు. చాలా సందర్భాల్లో నేనూ అలానే చేశాను. అది పెద్ద విషయమేమీ కాదు."
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు