Winter Face Wash for Dry Skin: చలికాలంలో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడమంటే పెద్ద సవాలుగా ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించినా సరే.. చర్మం పొడిబారిపోవడంతో పాటు ఇతర చర్మ సమస్యలు సైతం తలెత్తుతుంటాయి. అయితే వీటన్నింటికీ కారణం.. మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లే అంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అక్కడి చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఫలితంగా ముఖ సౌందర్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. మరి, అలా జరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఆ ఫేస్ వాష్‌లు వాడకూడదట
శరీరాన్ని, ముఖాన్ని క్లీన్ చేసుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల ఫేస్‌వాష్‌లు, బాడీ వాష్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో ఫోమ్ (నురగ) ఆధారిత వాష్‌లు చలికాలంలో ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఫోమ్‌కు బదులుగా జెంటిల్, క్రీమ్ తరహా క్లెన్సర్లు.. వంటివి ఉపయోగిస్తే చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.
ఆ పద్ధతి పాటించకూడదట
మనలో చాలామందికి పదే పదే ముఖం కడుక్కోవడం అలవాటు ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఒకే సమయంలో రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకునే డబుల్ క్లెన్సింగ్ పద్ధతిని పాటిస్తుంటారు. ఇందులో భాగంగా మొదటగా చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌తో ముఖం కడుక్కుంటారు. ఆపై నీటి ఆధారిత క్లెన్సర్‌తో కడగడం వల్ల చర్మంపై ఉండే చెమట, ఇతర మలినాలు తొలగిపోతాయని అంటున్నారు. దీనివల్ల చర్మం మరింతగా పొడిబారిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే, మేకప్ ఉపయోగించకుండా, మొటిమలు-జిడ్డుదనం వంటి సమస్యలేవీ లేనివారు ఈ తరహా పద్ధతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక మిగతా వారు కూడా తమ చర్మతత్వాన్ని బట్టి సరైన ఫేస్‌వాష్‌ని ఎంచుకొవాలని వివరించారు. నిపుణుల సలహా తీసుకుని నిర్ణీత వ్యవధుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమమని పేర్కొన్నారు.
ముఖంపై పేరుకున్న మృతకణాల్ని తొలగించుకునే క్రమంలో ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియను పాటిస్తుంటారు. అయితే ముఖం మరింత మృదువుగా మారాలన్న ఉద్దేశంతో కొందరు ఈ పద్ధతిని ఎక్కువసార్లు పాటిస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రక్రియ మితిమీరితే మృతకణాలు తొలగిపోకపోగా.. చర్మం మరింతగా పొడిబారిపోతుందని చెబుతున్నారు. కాబట్టి వారానికి రెండుసార్లు, అదీ ఇంట్లో తయారుచేసిన స్క్రబ్‌తో రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు వివరించారు.
విటమిన్ సి, డితో ఎంతో ఉపయోగం
Journal of Clinical and Aesthetic Dermatology ప్రకారం.. చర్మం పొడిబారకుండా చేసి మృదువుగా ఉంచడంలో సి, డి విటమిన్లు చాలా ఉపయోగపడతాయని అంటున్నారు. "Combination of Vitamins C and D for Improved Skin Health: A Randomized, Double-Blind, Placebo-Controlled Trial" అనే అశంపై జరిగిన అధ్యయనంలో Seoul National University College of Medicine ప్రొఫెసర్ Kim, J పాల్గొన్నారు. కాబట్టి ఈ విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారంతో పాటు.. అత్యవసరమైతే నిపుణుల సలహా మేరకు వీటిని సప్లిమెంట్ల రూపంలోనూ తీసుకోవచ్చని చెబుతున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చలికాలంలో ముఖం శుభ్రం చేసుకోవడానికి వేడి నీళ్లు కాకుండా.. చల్లటి నీళ్లు, గోరువెచ్చటి నీళ్లు వాడితే చర్మం పొడిబారిపోకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా మేకప్‌ను తొలగించుకోవడానికి చాలా మంది మిసెల్లార్ వాటర్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే చలికాలంలో రోజుకొక్కసారైనా వీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండానే పూర్తిగా క్లీన్ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే, జిమ్ నుంచి వచ్చాక.. ఇలా పలు సందర్భాల్లో చర్మం అలసటను దూరం చేసి ముఖాన్ని మెరిపిస్తుందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చలికాలంలో ఈ టిప్స్ పాటిస్తే అంతా సెట్ - చర్మం నుంచి వ్యాధుల వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవట!
చెమట పట్టకుండా, ఇంచు కదలకుండానే వ్యాయామం బెన్ఫిట్స్- "ఎక్సర్సైజ్ ట్యాబ్లెట్" రెడీ చేసిన పరిశోధకులు