Best Palces to Visit in Lambasingi : అందమైన పర్వతాలు.. కనుచూపుమేరా పచ్చని తివాచీలు పరిచినట్టు కనిపించే ముగ్ధమనోహర లోయలు.. గలగలలాడే సెలయేళ్లు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. విశాఖ మన్యానికి మణిహారం "లంబసింగి" అద్భుతాలివి. "ఆంధ్రా కశ్మీర్"గా కనువిందు చేస్తోన్న లంబసింగి సముద్రమట్టానికి సుమారు 4వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మంచు పొరలు కప్పుకున్న పర్వతాల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్కడికి వెళ్లి ప్రత్యక్షంగా ఆస్వాదిస్తే తప్పా. మరి వెకేషన్‌కు లంబసింగి వెళ్తే అక్కడ ఇంకా ఏయే ప్రాంతాలను చూడొచ్చు.. అక్కడ ఎలాంటి ఫుడ్ దొరుకుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లంబసింగిలో చూడాల్సిన ప్రదేశాలు:
వలిసె పూతోట: లంబసింగిలో పసుపు వర్ణంలో పరుచుకున్న వలిసె పూల తోటలు ప్రధాన ఆకర్షణ.
తాజంగి జలాశయం: లంబసింగి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో తాజంగి జలాశయం ఉంటుంది. ఈ ప్రయాణంలో అక్కడక్కడా కనిపించే గిరిజన గుడిసెలు, రోడ్డుకు రెండు వైపులా విరగబూసిన వృక్షాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ జలాశయంలో విహరించేందుకు పర్యాటకుల కోసం బోటింగ్ సదుపాయం కూడా ఉంటుంది.
కొత్తపల్లి వాటర్ ఫాల్స్: లంబసింగి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి జలపాతాలు ఉన్నాయి. ఇక్కడ జలపాతం సోయగాలు చూసిన పర్యాటకులకు ఆ ప్రాంతాన్ని విడిచి రావాలనిపించదు. జలపాతం పై నుంచి కిందికి మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు. జలపాతం కింద స్నానాలు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. జలపాతం వద్ద ట్రెక్కింగ్, స్విమ్మింగ్ వంటి అడ్వెంచర్స్ కూడా చేయవచ్చు.
చెరువులవేనం: లంబసింగి టూర్లో 'చెరువులవేనం' మోస్ట్ ఇంట్రస్టింగ్ అండ్ ఇంపార్టెంట్. ఇక్కడికి చేరుకోవాలంటే లంబసింగి నుంచి సుమారు గంట సేపు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కొండలపై నుంచి చేసే ఈ ట్రెక్కింగ్ సాహసోపేతమైన అనుభూతినిస్తుంది. ఆకాశం కిందికి దిగి వచ్చిందా అనే రీతిలో కళ్లముందు మబ్బులు కనువిందు చేస్తాయి. చెరువులవేనంలో పచ్చని అడవులు, కొండలను తాకుతూ పయనిస్తున్న పాలమబ్బులను చూసి సందర్శకులు తమను తాము మైమరిచిపోతుంటారు. అయితే అపురూపమైన ఈ సుందర దృశ్యాలు చూడాలంటే ఉదయం 10 గంటల లోపే వెళ్లాలి.
ఎలా చేరుకోవాలి: విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో లంబసింగి పర్యాటక కేంద్రం ఉంది. కారు లేదా బైక్ మీద ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి అనకాపల్లి మీదుగా తాళ్లపాలెం జంక్షన్, నర్సీపట్నం చేరుకోవాలి. నర్సీపట్నం జంక్షన్ నుంచి లంబసింగి 30 కిలోమీటర్లు. ఇక్కడి నుంచి అటవీమార్గంలో ఘాట్ రోడ్డు ప్రయాణం మొదలవుతుంది. దారిపొడవునా ఎన్నో ముగ్ధమనోహరమైన దృశ్యాలు, లోయలు, జలపాతాలు కనువిందు చేస్తాయి. వీటన్నింటినీ చూసుకుంటూ, నచ్చిన ఫోటోలు తీసుకుంటూ లంబసింగి చేరుకోవచ్చు.
బొంగులో చికెన్ : నాన్‌వెజ్ ప్రియులైతే ఆ ప్రాంతంలో దొరికే బొంగులో బిర్యానీ కచ్చితంగా టేస్ట్ చేయవచ్చు. నేచురల్‌గా తయారు చేసే ఈ బిర్యానీ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. బొంగులో నుంచి పొగలు కక్కుతూ బయటికొచ్చే బిర్యానీ తింటే వావ్ అంటారు.