Australia Social Media Ban : పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. 16ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వాడకుండా ఓ చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఓ బిల్లును ఆమోదించింది. సెనెట్ కూడా ఆమోదిస్తే ఈ బిల్లు చట్టరూపం దాల్చతుంది.
బుధవారం ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా 102 ఓట్లతో ఆమోదం పొందింది. మెజార్టీ పార్టీలు దీనికి మద్దతు తెలపగా, సభలో 13 మంది మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒకవేళ ఈ వారంలోనే ఇది చట్టరూపం దాల్చితే, సామాజిక మాధ్యమాలకు దీనిపై ఆదేశాలు జారీ చేస్తారు. అయితే ఈ నిబంధన అమలు చేసేందుకు సామాజిక మాధ్యమాలకు ఏడాది పాటు సమయం ఇవ్వనున్నారు. చిన్నపిల్లలు సోషల్‌మీడియా ఖాతాలు వినియోగించకుండా ఈ 12 నెలల్లో వీరు తమ మాధ్యమాల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది.
'నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా'
ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు (భారత కరెన్సీలో దాదాపు రూ.273 కోట్లకు పైమాటే) జరిమానా విధిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. టిక్‌టాక్, ఫేస్‌బుక్, స్నాప్‌చాప్, రెడిట్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ తదితర మాధ్యమాలకు కూడా ఈ చట్టం వర్తించనుంది. ఇది అమల్లోకి వస్తే, ప్రపంచంలోనే ఈ తరహా నిబంధనలు విధించిన మొదటిదేశంగా ఆస్ట్రేలియా నిలవనుంది.
ఇటీవల ఈ చట్టం గురించి ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ఓ సమావేశంలో ప్రకటించారు. కొత్త చట్టం అమలు బాధ్యత సామాజిక మాధ్యమాలదేనని స్పష్టంచేశారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆల్బనీస్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావాల నుంచి పిల్లల్ని కాపాడేందుకు అమెరికా సహా చాలా దేశాలు చట్టం తెచ్చేందుకు యత్నిస్తున్నాయి.
గతేడాది 15 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని ఫ్రాన్స్ ప్రతిపాదించింది. కానీ వినియోగదారులు తల్లిదండ్రులు సమ్మతితో నిషేధాన్ని దాటవేయగలిగారు. మరోవైపు యూఎస్‌లో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను యాక్సెస్ చేయాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరిగా ఉండాల్సిందే.