US Trump Jai Bhattacharya : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు తదుపరి డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించారు. ఈ మేరకు ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు.
"జై భట్టాచార్యను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్‌గా నియమించడం నాకు చాలా అనందంగా ఉంది. రాబర్డ్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సహకారంతో భట్టాచార్య ఎన్‌ఐహెచ్‌ను నడిపించి దేశ ప్రజల ప్రాణాలను కాపాడే ముఖ్యమైన ఆవిష్కరణలు చేసేందుకు పనిచేస్తారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా మార్చేందుకు వారిద్దరూ కలిసి కృషి చేస్తారు" అని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై జై భట్టాచార్య కూడా ఆనందం వ్యక్తం చేశారు. "అధ్యక్షుడు ట్రంప్ నన్ను తదుపరి ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమించారు. మేము అమెరికన్ శాస్త్రీయ సంస్థలను సంస్కరించి దేశాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తాం" అని ఆయన తెలిపారు.
జై భట్టాచార్య స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజీషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. ట్రంప్ కేబినెట్లో ఆరోగ్య మంత్రిగా ఎంపికైన రాబర్ట్ ఎఫ్ కెన్నడీని జై భట్టాచార్య గతవారమే కలిశారు. ఎన్‌ఐహెచ్‌పై తన ఆలోచనలను కెన్నడీతో షేర్ చేసుకున్నారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దాదాపు 50 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థ అమెరికా బయోమెడికల్ రీసెర్చిని పర్యవేక్షిస్తుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి ఇది అమెరికా వైద్య విభాగం కింద పనిచేస్తుంది. భట్టాచార్య సరికొత్త సృజనాత్మక అంశాలపై ఎన్‌ఐహెచ్ దృష్టి సారించాలని వాదిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆ సంస్థలో పాతుకుపోయిన వారి పట్టు తొలగించాలని చెబుతున్నారు.
కెన్నడీ సార్థ్యంలో హెచ్‌హెచ్‌ఎస్ ట్రంప్ కార్యవర్గానికి అత్యంత కీలకమైంది. ఇది అమెరికాలో వైద్య సేవలను చూసుకోవాల్సి బాధ్యత ఉంటుంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చిలో జై అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. స్టాన్‌ఫోర్డ్‌లో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. సెంటర్ ఫర్ డెమోగ్రఫీ అండ్ ఎకనామిక్ ఆఫ్ హెల్త్ అండ్ ఏజినింగ్ డైరెక్టర్‌గానూ జై భట్టాచార్య ఉన్నారు. ఇప్పుడు ఎన్‌ఐహెచ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.