Zelensky On Putin :బలమైన నాయకులు అన్నా, చర్చలన్నా రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్‌కు భయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విమర్శించారు. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధం ముగింపు పలికే విషయంలో తనతో చర్చలను పుతిన్ తోసిపుచ్చడం వల్ల అది తేలిపోయిందని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో జెలెన్‌స్కీ పోస్ట్ పెట్టారు.
"బలమైన నాయకులకు, చర్చలకు పుతిన్ భయపడతారని మరోసారి తేలిపోయింది. యుద్ధాన్ని పొడిగించడానికి ఆయన సాధ్యమైనంత ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వేసే ప్రతి కదలిక, ట్రిక్స్ అన్నీ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేవిగా ఉంటాయి. 2014లో రష్యా మాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించింది. 2022లో అది పూర్తిస్థాయి దండయాత్రగా మారింది"
-- జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
"ప్రస్తుతం శాంతిని సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఆ దిశగా ప్రయత్నించడం లేదు. ప్రపంచంలో స్థిరత్వానికి భంగం కలిగించేందుకు ఆయన వద్ద సామర్థ్యాలు నిండుగా ఉన్నాయి. కానీ, బలమైన నాయకుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేనంత బలహీనంగా ఉన్నారు. అందుకే మనం నిర్ణయాత్మకంగా, ఐక్యతతో వ్యవహరించాలి. శాంతిని విశ్వసించేవారంతా కలిసి రష్యాపై ఒత్తిడి పెంచాలి. అప్పుడే మనం నిజమైన శాంతిని సాధించగలం" అని జెలెన్‌స్కీ రాసుకొచ్చారు.
జెలెన్‌స్కీతో చర్చలు సాగవ్!
రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతిని నెలకొల్పే చర్చలు సాధ్యమేనని పుతిన్ పేర్కొన్నారు. అయితే, జెలెన్‌స్కీతో ఇది కుదరదని వ్యాఖ్యానించారు. చర్చలు జరిపి, రాజీ పడాలనే కోరిక ఉంటే చర్చలకు సిద్ధమని తెలిపారు.. కానీ, ఆ దేశాధ్యక్షుడితో ఈ చర్చలు సాగవని, తమ ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రయత్నాలుంటాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు కీవ్‌కు మద్దతు నిలిపివేస్తే ఈ పోరాటం రెండు నెలల్లోనే ముగిసిపోతుంది అని పుతిన్ చెప్పారు.
దాదాపు మూడేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. యుద్ధం అనేది అసలు మొదలుకాకూడదని, తాను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్‌లో సంక్షోభం వచ్చేది కాదని ఇటీవల అన్నాపరు. . త్వరలోనే దీనికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. శాంతి చర్చలకు ఇరుదేశాధ్యక్షులు ముందుకురావాలన్నారు. అయితే, కీవ్‌లో శాంతి ఒప్పందంపై చర్చలకు రష్యా రాకపోతే వారిపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు.