Putin President Swearing :రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి బాధ్యతలు చేపట్టారు వ్లాదిమిర్ పుతిన్. మంగళవారం క్రెమ్లిన్ హాల్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ప్రత్యర్థులను కనుమరుగు చేసిన పుతిన్, దేశంలోని అన్ని అధికారాలను హస్తగతం చేసుకుని మరింత శక్తిమంతంగా మారిపోయారు.
ఆ నిర్ణయాలు తీసుకునే అవకాశం!
ఇప్పటికే దాదాపు పాతిక సంవత్సరాలుగా ఈ పదవిలో కొనసాగుతున్న ఈయన, మరో ఆరేళ్ల పాటు ఉండనున్నారు. దీంతో స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. పుతిన్ ప్రస్తుత పదవి కాలం 2030 వరకు ఉంటుంది. ఆ తర్వాత మరోసారి పోటీ చేసేందుకు కూడా పుతిన్‌కు అర్హత ఉంది. పుతిన్ మరో ఆరేళ్లపాటు అధికారంలో ఉండనున్న నేపథ్యంలో యుద్ధానికి నిధులు సమకూర్చడానికి పన్నులను పెంచడం, సైన్యంలో చేరడానికి మరింత మందిని ఒత్తిడి చేయడం వంటి నిర్ణయాలను తీసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం
ఈ ఏడాది మార్చిలో జరిగిన రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘన విజయం సాధించారు. 87 శాతం ఓట్లతో(దాదాపు 76 మిలియన్ల ఓట్లు) పుతిన్ విజయం సాధించారని రష్యా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల ఫలితాల్లో పుతిన్ దరిదాపుల్లోకి ప్రత్యర్థులు రాలేకపోయారు. న్యూ పీపుల్ పార్టీ వ్లాదిస్లవ్ డవాంకోవ్ కు 4.8శాతం ఓట్లు, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన నికోలోయ్ ఖరితోనోవ్‌కు 4.1శాతం ఓట్లు, లిబరల్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన లియోనిడ్ స్లట్‌స్కీకి 3.15 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
వ్లాదిమిర్ పుతిన్ 24 ఏళ్ల పాలనలో కీలక పరిణామాలు
- 1999 డిసెంబర్ 31 - అప్పటి రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ తన పదవికి రాజీనామా చేశారు. 4 నెలల క్రితం ఆయన ప్రధానిగా నియమించిన వ్లాదిమిర్ పుతిన్‌ను రష్యా తాత్కాలిక అధ్యక్షుడిని చేశారు.
- 2000 మే 7 - దాదాపు 53 శాతం ఓట్లతో రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు. నాలుగేళ్ల పదవీకాలానికి రష్యా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
- 2003 అక్టోబర్ 25- వ్యాపారవేత్త, అప్పటి రష్యా కుబేరుడు మిఖాయిల్ ఖోడోర్కోవ్స్కీను పన్ను ఎగవేత, మోసం కేసులో పుతిన్ అరెస్ట్ చేయించారు. తర్వాత ఆయనకు 10 ఏళ్ల జైలుశిక్ష పడింది. అప్పటి నుంచి చమురు దిగుమతి దేశాలకు పుతిన్ శత్రువుగా మారారు.
- 2004 మార్చి 14 - పుతిన్ రెండోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- 2008 మే 8 - రాజ్యాంగం ప్రకారం వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం లేకపోవడం వల్ల 2008లో పుతిన్ ప్రధాని పదవి చేపట్టారు. ఈ సమయంలోనే అధ్యక్ష పదవీకాలాన్ని ఆరేళ్లకు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేశారు. అప్పుడు రష్యా అధ్యక్షుడిగా దిమిత్రి మెద్వెదేవ్ ఉన్నారు.
- 2008 ఆగస్టు 8-12 - రష్యా, జార్జియా మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు రష్యా వేర్పాటువాద అబ్ఖాజియా, దక్షిణ ఒస్సేటియా ప్రాంతాలపై పూర్తి నియంత్రణను సాధించింది.
- 2012 మార్చి 4 - పుతిన్ మూడోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
- 2013 జూన్ 6 - తన భార్య లియుడ్మిలాతో పుతిన్ విడాకులు తీసుకున్నారు.
- 2014 మార్చి 18- క్రిమియాను స్వాధీనం చేసుకున్న మాస్కో.
- 2015 ఫిబ్రవరి 27- పుతిన్‌పై రాజకీయ విమర్శలు చేసే మాజీ ప్రధాని బోరిస్ నెమత్సోవ్ మృతి చెందారు.
- 2015 సెప్టెంబరు 30- సిరియాపై రష్యా వైమానిక దాడులు
- 2018 మే 7- రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి పుతిన్ ఎన్నిక
- 2018 జులై 16 - హెల్సింకిలో జరిగిన ఒక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకున్నారు.
- 2020 ఆగస్టు 20 - సైబీరియాలో పుతిన్ రాజకీయ ప్రత్యర్థి, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం
- 2021 జనవరి 17 - జర్మనీ నుంచి వస్తుండగా మాస్కో విమానాశ్రయంలో నావల్నీ అరెస్టు. అనేక కేసుల్లో దోషిగా తేలడం వల్ల 19ఏళ్ల జైలుశిక్ష విధింపు
- 2022 ఫిబ్రవరి 24 - ఉక్రెయిన్-రష్యా యుద్ధం. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య.
- 2023 సెప్టెంబరు 30 - పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్
- 2023 జూన్ 23 - పుతిన్‌పై వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ తిరుగుబాటు చేశారు. కాగా, ఇలా తిరుగుబావుటా ఎగురవేసిన రెండు నెలల్లోనే ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో కన్నుమూశారు.
- 2024 ఫిబ్రవరి 16 - పుతిన్ రాజకీయ ప్రత్యర్థి, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలులో అనుమానాస్పద మృతి.
- 2024 మార్చి 17 - రష్యా అధ్యక్ష ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించి పుతిన్ విజయం
- 2024 మే 7 - రష్యా అధ్యక్షుడిగా ఐదో సారి బాధ్యతలు స్వీకరించిన పుతిన్.