తెలంగాణ

telangana

ఆగస్టు 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్​ పర్యటన! - PM Modi To Visit Ukraine On Aug 23

By ETV Bharat Telugu Team

Published : Aug 19, 2024, 7:40 PM IST

Updated : Aug 19, 2024, 8:02 PM IST

PM Modi To Visit Ukraine On Aug 23 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్​లో పర్యటించనున్నారు. నేపథ్యంలోనే, రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగున్న వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ దౌత్యం, చర్చలను సమర్థిస్తుందని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

PM Modi
PM Modi (ANI)

PM Modi To Visit Ukraine On Aug 23 :రష్యా దండయాత్రతో గత రెండేళ్లకు పైగా యుద్ధ భూమిలో నలిగిపోతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఆగస్టు 23న ఆయన కీవ్‌ను సందర్శిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇది ఎంతో ప్రాధాన్యత కలిగిన పర్యటన అని తెలిపింది. రష్యా-ఉక్రెయిన్‌ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ దౌత్యం, చర్చలను సమర్థిస్తుందని స్పష్టం చేసింది.

ఆగస్టు 23న ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపైనా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఉక్రెయిన్‌ కంటే ముందు ప్రధాని మోదీ ఆగస్టు 21న పోలండ్‌లో పర్యటించనున్నారు.

2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత ప్రధాని మోదీ కీవ్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. ఇటీవల ఇటలీ వేదికగా జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మోదీ, జెలెన్‌స్కీ భేటీ అయిన విషయం తెలిసిందే. భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించిన మోదీకి, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఫోన్‌ చేసి అభినందించారు. తీరిక చేసుకొని ఉక్రెయిన్‌లో పర్యటించాల్సిందిగా మోదీని కోరారు. ఈ నేపథ్యంలో మోదీ కీవ్‌ పర్యటనకు వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

కస్క్ కోసం దాడులు - ప్రతిదాడులు​
కస్క్‌ ప్రాంతంలో రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్‌ బలగాలు చొచ్చుకుపోయిన వేళ, మాస్కో నుంచి అంత కంటే ఎక్కువ ప్రతిస్పందన ఎదురవుతోంది. తూర్పు ఉక్రెయిన్‌లోని పోక్రోవ్స్క్‌తో పాటు సమీప పట్టణాలకు రష్యా దళాలు వేగంగా దూసుకొస్తూ తీవ్ర దాడులను చేస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నగరాన్ని వీడి వెళ్లిపోయేందుకు కొన్ని రోజుల సమయమే ఉందని, పోక్రోవ్స్క్‌తోపాటు సమీప పట్టణాలపై రష్యా బలగాలు తీవ్రంగా దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. చిన్నారులున్న కుటుంబాలు తప్పనిసరిగా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.

మరోవైపు రష్యాలోని కస్క్‌ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ దూసుకెళ్లిన ఉక్రెయిన్‌ సైన్యం అక్కడే తిష్ఠవేసేలా యత్నిస్తోంది. అందుకే నదులపై ఉన్న వంతెలను ఉక్రెయిన్‌ సైన్యం ధ్వంసం చేసింది. తద్వారా రష్యా సైన్యానికి సరఫరా వ్యవస్థల్ని అడ్డుకోవడం, తమ సైనిక దళాలు అక్కడ మరింతగా తిష్ఠవేసేలా చూడడం ప్రస్తుతం తమ లక్ష్యమని ఉక్రెయిన్‌ భావిస్తోంది. ఇరుదేశాల సైన్యాల పరస్పర దాడులతో కస్క్‌ రీజియన్‌లో ఇప్పటికే లక్ష మందికిపైగా పౌరులను రష్యా సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

Last Updated : Aug 19, 2024, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details