తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​-ఫ్రాన్స్​ ఫ్రెండ్​షిప్​ సూపర్​ స్ట్రాంగ్! ఇరు దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాలివే! - PM MODI FRENCH PRESIDENT MEETING

భద్రతామండలిలో భారత్​కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనన్న ఫ్రాన్స్​! వాణిజ్య, పెట్టుబడి భాగస్వామ్యాన్ని పెంచుకుంటామని ఇరు దేశాల ప్రకటన- 'భారత్, మిడిల్ ఈస్ట్, ఐరోపా కారిడార్' అమలుకు నిర్ణయం

PM Modi French President Meeting
PM Modi French President Meeting (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2025, 6:28 PM IST

Updated : Feb 12, 2025, 6:36 PM IST

PM Modi Macron Talks :ఇరుదేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ నిర్ణయించారు. ఇండో-పసిఫిక్ సహా వివిధ అంతర్జాతీయ వేదికల్లో కలిసికట్టుగా ముందుకు సాగాలనే అవగాహనకు వచ్చారు. మోదీ, మెక్రాన్ కలిసి రాజధాని పారిస్ నుంచి మార్సెయిల్ నగరానికి ఫ్రాన్స్‌ అధ్యక్షుడి ప్రత్యేక విమానంలో వెళ్లారు.

మార్సెయిల్ నగరానికి ఈ ఇద్దరు నేతలు చేరుకున్న అనంతరం భారత్, ఫ్రాన్స్ విదేశాంగ శాఖల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం మోదీ, మెక్రాన్ సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వారిద్దరు కలిసి మార్సెయిల్‌లో భారత కాన్సులేట్‌ను ప్రారంభించారు. 'భారత్ - మిడిల్ ఈస్ట్ - ఐరోపా కారిడార్'(IMEC) ప్రాజెక్టును అమలు చేయించాలని నిర్ణయించారు. మధ్యధరా సముద్ర ప్రాంతంలో మార్సెయిల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.

'ఐరాస శాశ్వత సభ్యత్వం- భారత్​కే ఫ్రాన్స్​ మద్దతు'
2026లో 'భారత్-ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌'ను నిర్వహించనున్నట్లు మోదీ, మెక్రాన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన లోగోను విడుదల చేశారు. ఫ్రాన్స్ ఆర్మీకి ఆసక్తిగా ఉంటే భారత్‌కు వచ్చి పినాక రాకెట్ లాంచర్ల వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని ప్రధాని మోదీ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసరంగా సంస్కరణలు జరగాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు ఉంటుందని మెక్రాన్ ప్రకటించారు.

అంతర్జాతీయ అంశాలు
పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైనా మోదీ, మెక్రాన్ మధ్య చర్చ జరిగింది. భారత్-ఐరోపా దేశాల సంబంధాల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యం ఉందని, త్వరలో దిల్లీలో జరగనున్న భారత్-ఈయూ సదస్సులో దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్ట్రేలియా, యూఏఈ దేశాలతో భారత్, ఫ్రాన్స్‌ త్రైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై శ్రద్ధ పెట్టడాన్ని వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చించారు. మార్సెయిల్ నగరం సమీపంలోని కాసిస్ పట్టణంలో భారత ప్రధాని మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ విందు ఇచ్చారు.

కీలకమైన ఒప్పందాలివీ
ఇరుదేశాల మధ్య రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్ష రంగాల వంటి వ్యూహాత్మక విభాగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిగాయి. ట్రయాంగ్యులర్ డెవలప్‌మెంట్ కోఆపరేషన్‌పై భారత్, ఫ్రాన్స్‌ సంయుక్త అంగీకార ప్రకటనను విడుదల చేశాయి. భారత్, ఫ్రాన్స్‌కు చెందిన పర్యావరణ, మత్స్య, అటవీ, జీవ వైవిధ్య, సముద్ర, వాతావరణ మార్పుల విభాగాలు ఈ సందర్భంగా డిక్లరేషన్‌పై సంతకాలు చేశాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (DST), ఫ్రాన్స్‌కు చెందిన ఐఎన్‌ఆర్ఏఐ విభాగం కలిసి 'ఇండో - ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ది డిజిటల్ సైన్సెస్'ను ఏర్పాటు చేయనున్నాయి. అడ్వాన్స్‌డ్ మాడ్యులర్ రియాక్టర్లు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఫ్రాన్స్ స్టార్టప్‌లు జట్టు కట్టాయి. భారత అణుఇంధన విభాగం (డీఏఈ), ఫ్రాన్స్‌కు చెందిన సీఏఈ విభాగాలు ఒప్పందాలను రెన్యువల్ చేసుకున్నాయి.

మజార్‌గెస్ శ్మశాన వాటిక సందర్శన
మార్సెయిల్ నగరంలో ఉన్న చారిత్రక మజార్‌గెస్ శ్మశాన వాటికను మెక్రాన్‌తో కలిసి భారత ప్రధాని మోదీ సందర్శించారు. ప్రపంచ యుద్ధం సమయంలో అమరులైన భారత సైనికుల సమాధుల వద్ద మువ్వన్నెల థీమ్‌తో కూడిన పుష్పగుచ్ఛాలతో మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. ఈ యుద్ధ స్మారక శ్మశాన వాటికను కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ (CWGC) నిర్వహిస్తోంది. ఇక్కడి స్మారక భవనంలో ఉన్న సందర్శకుల పుస్తకంలో ప్రధాని మోదీ తన అనుభూతిని అక్షరబద్ధం చేశారు. "మా సైనికులు విదేశీ గడ్డపైనా యుద్ధాల్లో పాల్గొన్నారు. భారతీయులు నీతి, నిబద్ధత, సాహసం, త్యాగనిరతికి మారుపేరు అని నిరూపించారు" అని ఆయన రాశారు.

Last Updated : Feb 12, 2025, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details