PM Modi Brunei Visit :బ్రూనైతో జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరు దేశాల మధ్య మెరుగైన భాగస్వామ్యాన్ని పెంచాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మూడు రోజులు విదేశీ పర్యటనలో భాగంగా బ్రూనై వెళ్లిన ప్రధాని బుధవారం ఆ దేశ సుల్తాన్ హసనల్ బోల్కియాతో భేటీ అయ్యారు. ముందుగా ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్‌కు వెళ్లిన మోదీకి హసనల్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతినిధుల స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ఇరువులు విస్తృతమై చర్చలు జరిపి పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
భారతీయుల తరపున బ్రూనై ప్రజలకు ప్రధాని మోదీ 40వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాక్షాంకలు తెలిపారు. బ్రూనైతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 40 సంవత్సరాలు కావడం కూడా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పర్యటన, ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించడానికి అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ' సుల్తాన్ హసనల్ బోల్కియాను కలవడం ఆనందంగా ఉంది. యాక్ట్‌ఈస్ట్ విధానం, ఇండో- పసిఫిక్ విజన్‌లో భారత్‌కు, బ్రూనై ముఖ్యమైన భాగస్వామి. ఈ పర్యటన, మా చర్చలు రానున్న కాలంలో రెండు దేశాల మధ్య స్నేహపూరిత సంబంధాలకు ఒక వ్యూహాత్మక దిశను అందిస్తాయని నేను విశ్వసిస్తున్నా. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైన భాగస్వామ్యాన్ని పెంచుతాయని నేను నమ్ముతున్నా.'' అని మోదీ పేర్కొన్నారు.