PM Modi Brunei Visit: వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బ్రూనైతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. చారిత్రక బంధాలను సరికొత్త ఎత్తులకు తీసుకువెళ్లడమే ఈ భేటీ ఉద్దేశమని తెలిపారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన తొలుత బ్రూనై చేరుకున్నారు. బ్రూనై దారుస్సలాం విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ యువరాజు అల్ ముహ్‌తడీ బిల్లా ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ సైనిక వందనం స్వీకరించారు.
'బలమైన సంబంధాల కోసం ఎదురుచూస్తున్నా'- బ్రూనై పర్యటనతో మోదీ సరికొత్త రికార్డ్ - PM Modi Brunei Visit - PM MODI BRUNEI VISIT
PM Modi Brunei Visit : ప్రధాని నరేంద్రమోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రూనై చేరుకున్నారు. మోదీకి ఆ దేశ యువరాజు హజ్ అల్-ముహతదీ బిల్లా స్వాగతం పలికారు. ఈ పర్యటనతో బ్రూనైలో అడుగుపెట్టిన తొలి భారత ప్రధానమంత్రిగా మోదీ చరిత్ర సృష్టించారు. బ్రూనైతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు.
Published : Sep 4, 2024, 7:25 AM IST
|Updated : Sep 4, 2024, 8:40 AM IST
బ్రూనైతో భారత ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా అక్కడ పర్యటిస్తున్నట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఆ దేశంతో భారత చారిత్రక సంబంధాలను ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం బ్రూనైకు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి అని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 'యాక్ట్‌ఈస్ట్ విధానంలో భారత్‌కు బ్రూనై ముఖ్యమైన భాగస్వామి. రెండు దేశాల మధ్య స్నేహపూరిత బంధాలున్నాయి. బహుళపాక్షిక అంశాలపై పరస్పరం గౌరవం, అవగాహనతో రెండు దేశాలూ ముందుకు వెళ్తున్నాయి'అని పేర్కొంది.
ప్రవాసులు ఇరు దేశాల వారధులు
ఇక ప్రధాని మోదీ బసచేసిన హోటల్ వద్దకు ప్రవాస భారతీయులు వచ్చి ఘన స్వాగతం పలికారు. వారితో కొద్ది సేపు ఆయన ముచ్చటించారు. విద్య, వైద్యం సహా వివిధ రంగాల్లో సేవలందిస్తూ, రెండు దేశాల మధ్య వారధులుగా నిలిచి, బంధాలను బలోపేతం చేస్తున్నారని వారిని కొనియాడారు. తన చిత్రాన్ని బహూకరించిన ఓ చిన్నారికి మోదీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. భారత హైకమిషన్ నూతన కార్యాలయ ప్రాంగణాన్ని ప్రారంభించారు. బ్రూనైలో ప్రఖ్యాత ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. బుధవారం బ్రూనై సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా, రాజకుటుంబీకులతో మోదీ భేటీ కానున్నారు.హసనాల్అధికారిక నివాసం ఇస్తానా నురుల్ ఇమాన్ ప్యాలెస్‌లో ఈ భేటీ జరగనుంది. ఈ ప్యాలెస్ ప్రపంచంలోనే అతి పెద్దది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ గురువారం సింగపూర్ వెళ్లనున్నారు.