Israeli Attack On Gaza: ఇజ్రాయెల్ సైన్యం గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 22మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మరో 15మంది గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు చెప్పారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక భవనాలపై శనివారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. 11మంది మహిళలు, ఇద్దరు చిన్నారులో సహా 22మంది మృతి చెందినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ స్పందించింది. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. పౌరులకు ఎటువంటి హాని కలిగించకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొంది.
'అనుకున్న లక్ష్యాలను సాధించాం'
మరోవైపు శనివారం చేసిన ప్రతీకార దాడులు ఇరాన్‌ను తీవ్ర నష్టాన్ని కలిగించాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తాము అనుకున్న అన్ని లక్ష్యాలను సాధించినట్లు పేర్కొన్నారు.
'ఇరాన్ సత్తాను ఇజ్రాయెల్‌కు చూపించాలి'
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు.ఇజ్రాయెల్‌పై ఎలా దాడులు చేయాలో తమ అధికారులు నిర్ణయిస్తారని తెలిపారు. తమ దేశ సత్తాను, సామర్థ్యాలను ఇజ్రాయెల్‌కు చూపిస్తామని తేల్చిచెప్పారు. టెహ్రాన్‌లో వేర్వేరు ఘటనలలో మృతి చెందిన సైనికులు, పోలీసుల కుటుంబాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇజ్రాయెల్ చేసిన దారుణ చర్యలను తక్కువ చేసి చూడవద్దని, అదే సమయంలో అతిగా భావించవద్దని అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ప్రజలు, దేశానికి మేలు జరిగే అనువైన మార్గాన్ని అధికారులు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇలామ్, కుజెస్థాన్ ప్రావిన్సుల్లోని 20 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. 100 యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఇరాన్ క్షిపణి, డ్రోన్ వ్యవస్థలకు భారీ నష్టం కలిగించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ వాదనను తోసిపుచ్చిన ఇరాన్ స్వల్ప నష్టమే జరిగిందని తెలిపింది.