Pakistan Accident :పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన 14 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరందరూ ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి లోయలో పడిపోవడం వల్ల పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిందీ దుర్ఘటన. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని బన్నూ జిల్లా నుంచి పంజాబ్ లోని ఖుషాబ్ వైపునకు వాహనం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 8 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులు అంతా కూలీ పనుల కోసం ఖుషాబ్కు వెళ్తున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. అధిక వేగం కారణంగానే వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
ముఖ్యమంత్రి సంతాపం
అయితే ఈ మినీ ట్రక్కు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలియజేశారు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.