Pakistan Blast News Today : సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో సంభవించిన జంట పేలుళ్లలో 30 మంది మరణించారు. 42 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలను పోలింగ్ స్టేషన్‌లకు వెళ్లకుండా నిరోధించేందుకు ఉగ్రవాదులు ఎన్నికల అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని సీనియర్ పోలీసు అధికారి అబ్దుల్లా జెహ్రీ తెలిపారు.
బలూచిస్థాన్‌లోని పిషిన్ ప్రాంతంలో ఓ స్వతంత్ర అభ్యర్థి కార్యాలయం వద్ద బుధవారం తొలిదాడి జరిగింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు ఒక లగేజీ బ్యాగులో బాంబును అమర్చి ఘటనాస్థలిలో పెట్టి వెళ్లారని, ఆ తర్వాత రిమోట్‌తో దాన్ని పేల్చివేసినట్లు పోలీసులు తెలిపారు. బాంబు తీవ్రతకు ఘటనాస్థలిలో అనేక ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతిన్నాయని చెప్పారు
మొదటి పేలుడు సంభవించిన చోటుకు 150 కిలోమీటర్ల దూరంలోని ఖిల్లా సయిఫ్ ఉల్లాహ్ జిల్లాలో రెండో బాంబు దాడి జరిగింది. ఈ దాడి కూడా ఎన్నికల కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 8 మంది పౌరులు మరణించారు. గాయపడ్డ 12 మందిని మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు దాడులకు ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ కూడా బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేయలేదు.