Kim Nuclear Weapons :నిత్యం క్షిపణులు, శక్తిమంతమైన బాంబుల పరీక్షలతో కవ్వించే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి వార్తల్లోకెక్కారు. అణ్వాయుధాల తయారీలో కీలకమైన యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌ను సందర్శించి శత్రు దేశాలపై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌కు కిమ్ వెళ్లిన చిత్రాలను ఉత్తరకొరియా అధికారిక మీడియా KCNA విడుదల చేసింది. అక్కడ కిమ్‌జోంగ్ ఉన్ శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచండి!
అక్కడే కలియ తిరిగిన కిమ్ ఉత్పత్తి కార్యకలాపాల గురించి వారిని అడిగి తెలుసుకున్నట్టు KCNA వెల్లడించింది. అణ్వాయుధాల సంఖ్యను భారీగా పెంచడానికి కావాల్సిన చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారని పేర్కొంది. యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ సాంకేతిక శక్తి పట్ల కిమ్ సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపింది. యురేనియం శుద్ధీకరణ ప్లాంట్‌కు సంబంధించి చాలా ఏళ్లుగా గోప్యత వహించిన ఉత్తరకొరియా తాజాగా ఆ చిత్రాలను బయటపెడ్డటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అణ్వాయుధాల ఉత్పత్తి ప్లాంట్‌ను సందర్శించిన తర్వాత ఓ రాకెట్ లాంచర్ ప్రయోగాన్ని కిమ్ వీక్షించారు. అనంతరం ప్రత్యేక దళాలు శిక్షణ పొందుతున్న ప్రాంతానికి వెళ్లి వారితో గ్రూప్ ఫొటో దిగారు. ఈ క్రమంలోనే ప్రత్యేక దళాలతో పాటు ఓ గన్ చేతపట్టి కాల్పులు జరిపారు.
యురేనియం శుద్ధీకరణ ప్లాంట్ వద్దకు కిమ్ ఎప్పుడు వెళ్లారనే విషయాన్ని KCNA వెల్లడించలేదు. 2010లో యోంగ్‌బ్యోన్‌లోని యురేనియం శుద్ధి కేంద్రాన్ని ఉత్తర కొరియా తొలిసారి బయటి ప్రపంచానికి చూపించింది. అప్పట్లో దానిని అమెరికా ప్రతినిధుల బృందం సందర్శించింది. ఇటీవల కాలంలో యోంగ్‌బ్యోన్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌లో శుద్ధీకరణ సౌకర్యాలను మరింత విస్తరించుకున్నట్లు ఉపగ్రహ చిత్రాల ఆధారంగా తెలుస్తోంది. అయితే తాజాగా కిమ్ సందర్శించిన కేంద్రం ఈ కాంప్లెక్స్‌లోనిదా కాదా అనేది తెలియాల్సి ఉంది. అణ్వాయుధాల్లో యురేనియం, ప్లుటోనియం రెండింటిని ఉపయోగించుకోవచ్చు. ఈ కాంప్లెక్స్‌లో రెండింటిని ఉత్పత్తి చేసే సదుపాయాలున్నట్టు తెలుస్తోంది.