Biden On Trump Incident : అమెరికాలో రాజకీయ హింసకు చోటు లేదని అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్ నగరంలో జరిగిన హత్యాయత్నాన్ని ఆయన ఖండించారు. ''ఇలాంటి హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలి. ఇటువంటి ఘటనలు, హింసాకాండలు జరగడానికి మేం అనుమతించలేం. ఇలాంటి నేరాలను ఉపేక్షించలేం. ఈ తరహా ఆగడాలకు తెగబడే వారిని క్షమించలేం'' అని బైడెన్ స్పష్టం చేశారు. వారాంతం కావడం వల్ల ప్రస్తుతం డెలావేర్‌లోని తన రెహోబోత్ బీచ్ హౌస్‌లో ఆయన ఉన్నారు. ట్రంప్‌పై దాడి ఘటన గురించి తెలిసిన వెంటనే బైడెన్ వెంటనే మీడియాతో మాట్లాడారు. ట్రంప్‌ను రక్షించడంలో కీలక పాత్ర పోషించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, అన్ని భద్రతా విభాగాల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ట్రంప్ బాగానే ఉన్నారు!
ఇక ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడి ఆరోగ్య వివరాలను బైడెన్ అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ అధికార వర్గాలు వెెల్లడించాయి. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, బట్లర్ నగర మేయర్ బాబ్ దండోయ్‌లతో కూడా బైడెన్ మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ''ప్రస్తుతం ట్రంప్ బాగానే ఉన్నారు. ఆయనతో నేను కొన్ని గంటల క్రితమే మాట్లాడాను. ఇది హత్యాయత్నమా? కాదా ? అనేది తెలియాలంటే ఇంకొంత దర్యాప్తు జరగాలి. వాస్తవం ఏమిటో నాకు కూడా తెలియదు'' అని బైడెన్ చెప్పారు.
మరోవైపు అమెరికా సీక్రెట్ సర్వీస్ విభాగం డైరెక్టర్ కింబర్లీ చీటుల్, హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రెటరీ అలెజాండ్రో మయోర్కస్, హోం ల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్ లిజ్ షెర్వుడ్ రాండాల్, అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్, జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలీవన్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రేలు బైడెన్‌కు ఈ ఘటనపై సమాచారాన్ని అందించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకొని వైట్‌హౌస్‌కు బైడెన్ చేరుకోనున్నారు. అనంతరం అన్ని భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై ట్రంప్‌పై జరిగిన దాడి ఘటనపై అధ్యక్షుడు బైడెన్ సమీక్షించనున్నారు. ఈ కేసుపై దర్యాప్తును ప్రారంభించామని ఎఫ్‌బీఐ ప్రకటించింది.
ప్రముఖుల స్పందన
డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనను అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ తీవ్రంగా ఖండించారు. '' ఈ అసహ్యకరమైన చర్యను మనమందరం ఖండించాలి. ఈ ఘటన మరింత హింసకు దారితీయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది'' అని కమలా హ్యారిస్ తెలిపారు. ఈమేరకు ఆమె ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఓ పోస్ట్ చేశారు. ట్రంప్ వేగంగా కోలుకోవాలని బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ ఆశాభావం వ్యక్తం చేశారు.