Nitrogen Gas Death Chamber Alabama :కాలం మారి మనిషి నాగరికత వైపు అడుగులేస్తున్న కొద్దీ మరణశిక్ష అమలు విధానమూ మారుతోంది. శిరచ్ఛేదం, ఉరి, విషపుసూది, తాజాగా నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్షఅమలు జరిగింది. చాలా తేలికైన, సుఖవంతమైన చావు కోసమే మరణశిక్ష పడిన హంతకుడు కెన్నెత్ యూజీన్ స్మిత్‌కు నత్రజని వాయువుతో దండన అమలు చేసినట్లు అలబామా ప్రభుత్వం తెలిపింది. అయితే మరణం అంతసులభంగా జరగలేదని ప్రత్యక్షసాక్షుల ద్వారా తెలిసింది. శిక్ష అమలు ప్రక్రియ దాదాపు 22 నిమిషాలు సాగింది.
'చాలా నిమిషాల పాటు విలవిల్లాడిపోయాడు'
58 ఏళ్ల స్మిత్ చాలా నిమిషాల పాటు విలవిల్లాడిపోయాడని అతడి ఆధ్యాత్మిక సలహాదారు రెవరెండ్ జెఫ్ హుడ్ చెప్పారు. మెలికలు తిరుగుతూ, గిలగిలా కొట్టుకున్నాడని అదో "హారర్ షో"అని వివరించారు. నైట్రోజన్ గ్యాస్ మాస్క్‌ను ముఖానికి పెట్టాక కొన్ని సెకన్లలో స్మిత్ స్పృహ కోల్పోయి నిమిషాల్లోనే మరణం సంభవిస్తుందని అటార్నీ జనరల్ చెప్పినట్లుగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటన మరపురావడం లేదని, ఇకపై మరవలేనని కూడా చెప్పారు. హాల్మన్ జైలుసిబ్బంది కూడా ఆ చావును చూసి షాక్‌కు గురయ్యారని సమాచారం.
జైలు అధికారులు ఇలా
ఇక ప్రత్యక్ష సాక్షి వాదనతో జైలు అధికారులు విభేదించారు. మరణశయ్యపై స్మిత్ తీవ్రస్థాయిలో కాళ్లు, చేతులు ఆడించడం అసంకల్పిత చర్యలని పేర్కొన్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల అతడు ఇబ్బంది పడ్డాడని తెలిపారు. మరణశిక్షకు ముందు స్మిత్ శ్వాసను బిగబట్టి ఉండొచ్చని కూడా అనుమానం వ్యక్తంచేశారు. నైట్రోజన్ శరీరంలోకి ప్రవేశించేటప్పుడు స్మిత్‌కు వాంతి వస్తుందని, అది గొంతుకు అడ్డుపడి ఇబ్బంది తలెత్తుతుందని అధికారులు శిక్ష అమలుకు 8 గంటల ముందు అతడికి ఎలాంటి ఆహారం ఇవ్వలేదు.