PM Modi Nigeria Visit : నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ, ఇంధనం, వాణిజ్యం సహా పలు రంగాల్లో నైజీరియాతో సంబంధాలను పెంపొందించేందుకు భారత్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్ టినుబుతో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
'వాటి కోసం కలిసి పనిచేస్తాం'
"ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. వాటిని ఎదుర్కోవడానికి భారత్, నైజీరియా కలిసి పనిచేస్తూనే ఉంటాయి. నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్యం ఇస్తుంది. ఈ చర్చల తర్వాత ఇరుదేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని విశ్వసిస్తున్నాను. దాదాపు 60,000 మంది ప్రవాస భారతీయులు భారత్-నైజీరియా సంబంధాలకు కీలక స్తంభంగా నిలుస్తున్నారు. వారి సంక్షేమానికి భరోసా ఇచ్చినందుకు టినుబుకు ధన్యవాదాలు. గత నెల(సెప్టెంబరు)లో బీభత్సం సృష్టించిన వరదల వల్ల నష్టపోయిన నైజీరియా ప్రజల కోసం భారత్ 20 టన్నుల సహాయ సామగ్రిని పంపుతుంది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వం పొందడం ఒక కీలక పరిణామం" అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
ఒప్పందాలు కుదిరే అవకాశం
కాగా, ప్రతినిధి స్థాయి చర్చలకు ముందు భారత ప్రధాని మోదీ, నైజీరియా అధ్యక్షుడు టినుబు ప్రెసిడెన్షియల్ పరస్పరం సమావేశమయ్యారు. ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.