Nepal Political Crisis :నేపాల్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదార్ దేవ్బా, బుధవారం ప్రధాని పుష్ప కమల్ దహల్ 'ప్రచండ'ను పదవికి రాజీమానా చేయాలని కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రచండ సహకరించాలని సూచించారు.
మాజీ గెరిల్లా నాయకుడైన ప్రచండను ప్రధాని పదవి నుంచి తొలగించేందుకు, అధికార సంకీర్ణ కూటమి భాగస్వామి అయిన సీపీఎన్-యూఎంఎల్ నిర్ణయించుకుంది. ఇప్పటికే ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. అంతేకాదు ఆ పార్టీకి చెందిన మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలుగతూ మూకుమ్మడిగా రాజీనామాలు కూడా చేశారు.
'నేపాలీ కాంగ్రెస్, యూఎంఎల్ కలిసి కొత్త ఏర్పాటు చేస్తాయి. కనుక ప్రధాని పదవికి పుష్ప కమల్ దహల్ ప్రచండ రాజీనామా చేయాలి' అని దేవ్బా అన్నారు. ఖాట్మండు శివార్లలోని బుధానిలకంఠలో తన నివాసంలో జరిగిన పార్టీ కీలక సమావేశం అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
రొటేషన్ పద్ధతిలో అధికారం!
మాజీ ప్రధానులైన 'నేపాలీ కాంగ్రెస్' అధ్యక్షుడు దేవ్బా, 'కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ - యూనిఫైడ్ మార్క్సిస్ట్, లెనినిస్ట్' (CPN-UML) ఛైర్మన్ కేపీ శర్మ ఓలి సోమవారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్లో మిగిలిన కాలమంతా రోటేషన్ పద్ధతిలో ప్రధానమంత్రి పదవిని పంచుకునేందుకు పరస్పర అంగీకారానికి వచ్చారు.