Israel Gaza Deal : సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం వల్ల పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. హమాస్ మిలిటెంట్ల చెరలోని బందీల విడుదల ఒప్పందంపై జరుగుతున్న చర్చలు చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను కనెస్సెట్ చట్టసభ్యులకు ఇజ్రాయెల్ రక్షణమంత్రి కాట్జ్ వెల్లడించినట్లు సమాచారం.
రహస్య చర్చలు
కనెస్సెట్‌లోని విదేశాంగ, రక్షణ కమిటీతో బందీల విడుదలపై కాట్జ్ రహస్యంగా చర్చలు జరిపారు. అయితే, ఆయన రహస్య ప్రసంగం హిబ్రూ మీడియాలో ప్రసారం కావడం గమనార్హం. మరోవైపు గాజాతో కాల్పుల విరమణ, బందీల విడుదలపై చర్చించేందుకు ఇజ్రాయెల్ సాంకేతిక బృందం సోమవారం ఖతార్‌లోని దోహాకు వెళ్లినట్లు తెలుస్తోంది. దోహాలోని హమాస్ సీనియర్ అధికారి సైతం చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే మధ్యవర్తులుగా ఉన్న ఈజిప్టు, ఖతార్‌లకు తెలియజేశామన్నారు.
ట్రంప్ రాయబారితో నెతన్యాహూ చర్చలు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బందీల విడుదల చర్చలకు నియమించిన రాయబారి ఆడమ్ బోహ్లర్‌తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమావేశమయ్యారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ విషయంపై నెతన్యాహు ఇప్పటికే ట్రంప్‌తో మాట్లాడారని వెల్లడించింది. అమెరికా పౌరసత్వం కలిగిన ఏడుగురు - హమాస్ మిలిటెంట్ల చెరలో బందీలుగా ఉండగా, అందులో నలుగురు మరణించారని అధికారులు తెలిపారు.
గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో సుమారు 1,200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని ఆ సంస్థ బంధించి గాజాకి తీసుకెళ్లింది. మధ్యలో తాత్కాలికంగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం వేళ కొందరు బందీలు విడుదలవగా, ఇంకా 97 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే పలు ఘటనల్లో మరికొందరు మృతి చెందారు. ప్రస్తుతం 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ మీడియా చెబుతోంది. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో 45,028 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 1,06,962 మంది గాయాలపాలయ్యారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.