Gaza Death Toll : గాజాలో నరమేధం ఆగడం లేదు. గత 14 నెలలుగా కొనసాగుతోన్న ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా గాజాలో మృతుల సంఖ్య 45 వేలు దాటింది. గతేడాది అక్టోబర్ 7న దాడి తర్వాత హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్-హమాస్ దగ్గరగా ఉన్నాయని ఓవైపు వార్తలు వస్తున్నా, గాజాలో రక్తపాతం మాత్రం ఆగడం లేదు.
మరో 52 మంది మృతి
గాజావ్యాప్తంగా ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో గత 24 గంటల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చిన్నారులు, మహిళలే అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది. నుసీరత్ శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో అల్ జజీరా ఛానల్‌కు పనిచేస్తున్న పాలస్తీనా పాత్రికేయుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 45,028 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 1,06,962 మంది తీవ్రంగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.
హమాస్ వల్లనే మారణహోమం
ఇజ్రాయెల్ మాత్రం ఈ మారణహోమానికి హమాస్ సంస్థనే కారణం ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు 17 వేల మంది హమాస్ మిలిటెంట్లను తాము హతమార్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. సాధారణ ప్రజలను హమాస్ సంస్థ రక్షణ కవచంలా వాడుకుంటోందని దుయ్యబట్టింది. గాజాలోని నివాసిత ప్రాంతాల్లో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నందునే సాధారణ ప్రజలు బలి అవుతున్నారని పేర్కొంది. అయితే గాజా పౌరుల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ఇజ్రాయెల్ విఫలమైనట్లు పౌర హక్కుల సంఘాలు, పాలస్తీనా ప్రజలు ఆరోపిస్తున్నారు.
సిరియా సైనిక స్థావరాలపై దాడి
మరోవైపు సిరియా సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం పలు ఆయుధ కేంద్రాలపై టెల్ అవీవ్ క్షిపణులు ప్రయోగించింది. 2012 తర్వాత సిరియాపై ఇజ్రాయెల్ చేసిన భారీ దాడి ఇదేనని యూకేలోని సిరియా అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్‌రైట్స్ పేర్కొంది. సిరియా తీరప్రాంత నగరమైన టార్టస్‌లో భారీ బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయని పేర్కొంది.