Tips And Tricks Should be Fallowed to Learn New Language : నేటి డిజిటల్ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంలా మారింది. కెరీర్‌లో ఎదగాలి అంటే మాతృభాష ఒక్కటే వస్తే సరిపోదు. ఇతర భాషలూ తెలిసి ఉండాలి. ఏదైనా పని మీద కొత్త ప్రాంతానికో, లేక దేశానికో వెళ్లినప్పుడు అక్కడి భాషనో లేక కొత్త వ్యక్తులతో డీల్ చేయగల సమర్థత ఉన్నవారికే ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అందువల్లే ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత ప్రయోజనం. మరి మీరు కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు ప్రయత్నించి చూడండి.
- ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు రావడం లేదని నిరుత్సాహపడతారు. అలా కాకుండా నేర్చుకోవడంలో చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అక్షరాలు, పదాలు, వాక్యాలు ఇలా నేర్చుకుంటున్న కొద్దీ మీలో ఉత్సాహం, విశ్వాసం రెండు పెరుగుతాయి. అదే మీరు భాషను త్వరగా నేర్చుకునేలా ప్రేరణ ఇస్తుంది.
- ఏ భాష నేర్చుకోవాలనుకుంటారో దాంట్లోనే ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. అదే భాషలో సినిమాలు చూడటం, మ్యూజిక్ వినడం చేస్తుండాలి. తద్వారా మీరు నేర్చుకోవాలనుకునే భాషకు సంబంధించిన సంభాషణలు వినే నైపుణ్యం మెరుగుపడుతుంది.
- రోజూ కొత్త పదాలు, పదబంధాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కొత్త పదాలను నేర్చుకోవడం వల్ల పద సంపద పెరిగి ఆ భాష పట్ల అభిమానం పెరుగుతుంది.
- వార్తలంటే ఇష్టపడే వారైతే మీరు నేర్చుకోవాలనుకొంటున్న భాషలో న్యూస్ పేపర్‌ను చడవడం, టీవీ చూడటం చేయాలి. తెలియని పదాలు ఉంటే వాటి అర్థం కోసం ద్విభాషా నిఘంటువు వాడాలి. లేదా ఫోన్‌లో కూడా సర్చ్ చేస్తే అర్థాలు వస్తాయి.
పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలా? - ఈ స్మార్ట్ టిప్స్ పాటిస్తే బెటర్!
- మీరు రోజంతా ఏం చేస్తారో అదే భాషలో రాయడం అలవాటు చేసుకోవాలి. మీ అనుభవాలు, ఆలోచనలు, మీకు నచ్చిన అంశాలను ఒక పుస్తకంలో రాయడం ద్వారా పద సంపద పెరుగుతుంది. వ్యాఖ్య నిర్మాణం కూడా మెరుగవుతుంది. ఇప్పుడు భాషలు నేర్పే యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆ యాప్‌ల సాయంతో భాష పరిజ్ఞానానికి మరింత పదును పెట్టవచ్చు.
- మీరు ఏ భాషనైతే నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఆ భాష మాట్లాడే వారితో స్నేహం చేయండి. వారిని కలసినప్పుడు అదే భాషలో మాట్లాడితే సులభంగా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీ మాటల్లో తప్పులు దొర్లినా వారు సరి చేస్తుంటారు.
- ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ పుస్తకాలు చదవాలి, పాటలు వినడం చేయాలి. అవతలి వ్యక్తులతో మీరు జరిపే చర్చలు, ఆలోచనలు అదే భాషలో వ్యక్తపరచండి.
- కొత్త విషయాలు నేర్చుకొవాలంటే చొరవ చాలా అవసరం. బిడియం, సిగ్గు నుంచి బయటపడి కొత్త వారితో మాట్లాడటం చేయాలి. అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు మిమ్మల్ని మీరే ప్రశంశించుకోవడం చేస్తే మరింత ప్రేరణ పెరుగుతుంది.
అదృష్టం, ఐశ్వర్యం తొందరగా కలిసి రావాలా? - మీరు జన్మించిన నెలలో ఈ పరిహారాలు చేస్తే మంచిదట!