US School Shooting : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్ క్రైస్తవ పాఠశాలలో ఓ 15 ఏళ్ల విద్యార్థిని కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. మృతుల్లో ఓ టీచర్, విద్యార్థి ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన అమ్మాయి కూడా మరణించింది. అయితే ఆమె 12వ తరగతి విద్యార్థిని అని, బహుశా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు చెప్పారు.
భయాందోళనలు
ఈ కాల్పులు ఘటనకు సంబంధించిన వివరాలను దేశాధ్యక్షుడు బైడెన్‌కు అధికారులు తెలియజేశారు. 400 మంది విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పులు జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా భయాందోళనలు చోటుచేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీసులు వాహనాలు, అంబులెన్స్‌లు, ఫైరింజన్లు పాఠశాలను మోహరించాయి. ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాస్తవానికి విస్కాన్సిన్లో మైనర్లు తుపాకీలు కలిగి ఉండడం నేరం. మరి 17 ఏళ్ల అమ్మాయి దగ్గరకు ఎలా గన్ వచ్చిందో, ఆమె ఎందుకు కాల్పులకు పాల్పడిందో తెలియాల్సి ఉంది.
తుపాకి సంస్కృతి
తాజా ఘటనతో అగ్రరాజ్యంలో మరోసారి తుపాకీ సంస్కృతిపై చర్చ సాగింది. తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత యూఎస్‌లో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారింది. ఇటీవల కాలంలో అమెరికాలో పాఠశాలల్లో కాల్పులు ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది.