Young Man Cheated Pensioner : పక్కింటి వాడని నమ్మినందుకు బ్యాంకు ఖాతాలోని రూ.18 లక్షలను కాజేశాడు. పింఛన్ కింద ప్రతి నెలా డబ్బులు బాధితుడి బ్యాంకు ఖాతాలోకి పడుతుంటాయి. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ప్రతి నెలా వచ్చిన డబ్బులను బ్యాంకుకు వెళ్లి డ్రా చేసుకొని ఇంటికి తెచ్చుకునేవాడు. ఈ మధ్యకాలంలో పింఛన్ పెరగ్గా, ఆ విషయం సదరు వ్యక్తికి తెలియలేదు. పక్కింటి యువకుడిని సాయం కోరగా, ఇదే అదునుగా భావించి ప్రతి నెలా పింఛనుదారుడి ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తూ ఉండేవాడు. ఈ విషయం ఎట్టకేలకు పింఛనుదారుడికి తెలియడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో జరిగింది.
బాధితుడు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, జగిత్యాల జిల్లా గాంధీనగర్‌కు చెందిన నక్క లక్ష్మణ్ ఎస్సారెస్సీలో పని చేసి 20 ఏళ్ల కిందట పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో ఆయనకు పింఛను కింద నెలకు రూ.20 వేల పింఛన్ వచ్చేది. ఆ తర్వాత ఆ మొత్తం పెరిగి రూ.44 వేలకు చేరింది. ఈ విషయం సదరు వ్యక్తికి తెలియదు. అయితే ఓ సందర్భంలో పింఛన్ సొమ్ము విషయమై ఇంటి పక్కనే ఉండే దీకొండ తిరుపతి అనే యువకుడి సాయం కోరాడు. దీంతో అతడితో పాటు బ్యాంకుకు వెళ్లిన తిరుపతి, లక్ష్మణ్ బ్యాంకు ఖాతాకు తన ఫోన్ నంబర్‌ను అనుసంధానించుకున్నాడు.
ఈ క్రమంలో పింఛనదారుడికి ప్రతి నెలా వచ్చిన పింఛన్ రూ.44 వేలల్లో రూ.24 వేలను తిరుపతి డ్రా చేసుకుంటూ ఉండేవాడు. ప్రతి నెలా పింఛను పెరుగుతుందేమోనన్న ఆశతో బ్యాంకుకు వెళ్లగా, బ్యాంకు ఖాతాలో రూ.20 వేలే ఉంటుండటంతో పింఛన్ పెరగలేదని అనుకునేవాడు. ఇలా నెలకు రూ.20 వేలే డ్రా చేసుకుని ఖర్చులకు వినియోగించుకునేవారు.
అయితే గత మే నెలలో లక్ష్మణ్ బ్యాంకుకు వెళ్లి, స్టేట్మెంట్ చూడగా రూ.44 వేలు పింఛన్ వస్తున్నట్లు తెలిసింది. ఇలా ఎన్ని పడ్డాయో చూసుకొని, మొత్తం లెక్కించగా తిరుపతి రూ.18 లక్షలు కాజేసినట్లు వెల్లడైంది. దీంతో లబోదిబోమన్న లక్ష్మణ్ వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే డబ్బులు ఇస్తానని తిరుపతి ఒప్పుకున్నాడు. కానీ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని లక్ష్మణ్ వాపోయారు. ఈ క్రమంలో బాధితుడు జిగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. తన అమాయకత్వం చూసి కాజేసినట్లు తనకు స్మార్ట్‌ఫోన్ లేదని బాధితుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన డబ్బులు ఇప్పించాలని ఫిర్యాదులో వేడుకున్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.
ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలన్న అన్నపై తమ్ముడి దాడి - మనస్తాపంతో పిల్లలతో సహా తండ్రి బలవన్మరణం
వామ్మో ఎంత తెలివి! - ఇంత పకడ్బందీగా, పద్దతిగా కూడా డబ్బులు కొట్టేస్తారా?