Trump Modi America Tour : ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఆ సమయంలో మోదీతో తాను భేటీ కానున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వచ్చే వారంలో ఆయనతో భేటీ ఉంటుందని ఓ సభలో పేర్కొన్నారు. మోదీ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మిచిగాన్‌లోని ఫ్లింట్ నగరంలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్, ప్రధాని మోదీతో భేటీ అవుతానని ప్రకటించటంపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.
"మోదీ వచ్చే వారం వస్తున్నారు. నేను ఆయన్ను కలవబోతున్నాను. ఆయన ఓ అద్భుతం. అదే ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి." అంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు ట్రంప్. అయితే ఎక్కడ కలుస్తారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. దిగుమతులపై భారత్ భారీసుంకాలను విధిస్తోందని పేర్కొన్నారు. "వారు(సుంకాలు విధించే దేశాలు) ఎంతో తెలివైన వారు. మాకు వ్యతిరేకంగా వారు వ్యవహరిస్తున్నారు. భారత్ ఎంతో కఠినమైనది. బ్రెజిల్ కూడా కఠినమైనది. చైనా అన్నింటికంటే కఠినమైనది. కానీ మేము సుంకాల విషయంలో చైనాను జాగ్రత్తగా ఉంటాము." అని పేర్కొన్నారు.