Modi America Tour : అమెరికా న్యూయార్క్లో ఆదివారం(సెప్టెంబరు 22న) జరగనున్న 'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' ఈవెంట్కు పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ వెల్లడించింది. ఈ కార్యక్రమానికి నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియం వేదిక కానున్నట్లు పేర్కొంది. కాగా, ఈ కార్యక్రమానికి దాదాపు 14వేల మంది హాజరవ్వనుండగా, పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు రానున్నారని తెలుస్తోంది. 500 మంది కళాకారులు, 350 మంది వాలంటీర్లు, 85 మీడియా వర్గాలు, 40కి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించనున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఈవెంట్‌లో ప్రవాస భారతీయులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
కళాకారుల ప్రదర్శనలు
'మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్' కార్యక్రమంలో 'ఎకోస్ ఆఫ్ ఇండియా ఏ జర్నీ ఆఫ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్' నిర్వహించనున్నామని ఈవెంట్ కీలక నిర్వాహకుడు సుహాగ్ శుక్లా వెల్లడించారు. ఈ కార్యక్రమం కోసం రెండు వేదికలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధాన వేదికపై గ్రామీ అవార్డ్ నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు వివిధ సాంస్కృతిక కళలు ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. మరో వేదికపై 117 మంది కళాకారుల విశిష్ట ప్రదర్శనలతో కొలీజియంలోకి ప్రవేశించిన వారిని అలరిస్తారని అన్నారు. 30కి పైగా శాస్త్రీయ, జానపద, ఆధునిక ఫ్యూజన్ ప్రదర్శనలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
గతంలో రెండుసార్లు
అయితే, దేశానికి తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ, 2014లో న్యూయార్క్లో జరిగిన ఓ భారీ కమ్యూనిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రఖ్యాత మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత 2019లో టెక్సాస్ హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన మెగా కమ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోదీ. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ కార్యక్రమంలో భాగమయ్యారు.
ప్రధాని మోదీ యూఎస్ తొలి పర్యటన గుర్తులు
మరోవైపు, ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ఇప్పటికే అధికారికంగా ఎన్నోసార్లు అమెరికా వెళ్లిన ప్రధాని, 1993లో తొలిసారి యూఎస్ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ తొలిసారి అమెరికా పర్యటన నాటి సంగతులను మీడియాతో పంచుకున్నారు ప్రవాస భారతీయులు. 1993లో ప్రధాని మోదీ తొలిసారి యూఎస్ పర్యటనకు వచ్చారని, ఈ సందర్భంగా ఆయనను కలిసే అవకాశం తనకు వచ్చిందని అట్లాంటాకు చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ వాసుదేవ్ పటేల్ తెలిపారు. ప్రధాని మోదీ యూఎస్ లోని సాంకేతికతపైనా, తాను పర్యటించే ప్రాంతాల చరిత్ర తెలుసుకోవాలనే విషయంపై చాలా ఆసక్తి కనబర్చారని గుర్తుచేసుకున్నారు.
"మేం ఏ ప్రాంతానికీ వెళ్లినా, ఎప్పుడూ ఏదోఒకటి చదువుతూనే ఉండేవారు మోదీ. ఏదైనా చారిత్రక సమాచారాన్ని చూస్తే, వెంటనే దానిని చదివేసేవారు. ఆయనకు బస కల్పించినవారికి భారంగా ఉండకూడదనని భావించేవారు. ఇంటి, వంట పనిలో ఏదైనా సాయం కావాలా? అని తరచూ అడిగేవారు. ఫొటోగ్రఫీ అంటే ప్రధానికి చాలా ఇష్టం. తన పర్యటనలకు సంబంధించి ప్రతీ విషయాన్ని కెమెరాలో బంధించాలనుకునేవారు. తన అనుభవాలకు సంబంధించిన చిత్రాలతో గాంధీనగర్‌లో ఒక పెద్ద ఫొటో లైబ్రరీ ఉంది. అలాగే ప్రతీ ఒక్కరితో మోదీకి మంచి సంబంధాలు ఉండేవి. చిరునవ్వుతో మాట్లాడుతారు. సాయం చేయడంలో ముందుండేవారు "
- డాక్టర్ వాసుదేవ్ పటేల్, ప్రవాస భారతీయుడు