Maldives President Impeachment Process : మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై ఆ దేశ పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అవసరమైన సంతకాలను ప్రతిపక్ష పార్టీలు సేకరించినట్లు స్థానికంగా ఉండే మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇతర విపక్ష పార్టీలతో కలిసి తాము సంతకాలను సేకరించినట్లుగా ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) ఎంపీ చెప్పినట్లు పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఎండీపీ అభిశంసన తీర్మానాన్ని ఇంకా పార్లమెంటులో సమర్పించలేదని కొన్ని టీవీ ఛానళ్లు పేర్కొన్నాయి. మరోవైపు అనూహ్యంగా జరిగిన ఈ పరిస్థితుల దృష్ట్యా పార్లమెంట్ లోపల, బయటా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.
"సోమవారం ఎండీపీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ గ్రూప్ మీటింగ్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై అభిశంసన తీర్మానం పెట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించాము. ఇందుకు కావాల్సిన సంతకాలను సేకరించాం. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నాం."
- ఎండీపీ ఎంపీ
ఒక్కాసారిగా వేడెక్కిన రాజకీయాలు!
అంతకుముందు ఆదివారం అధికారపార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, విపక్ష పార్టీల ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతాలతో మాల్దీవుల పార్లమెంట్ రణరంగంగా మారింది. ఈ ఘటన జరిగిన మరుసటిరోజే అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుపై అభిశంసన తీర్మానం పెట్టనున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అక్కడి రాజకీయాలు ఒక్కాసారిగా వేడెక్కాయి. కాగా, గతేడాది సెప్టెంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 61 ఏళ్ల ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌ను ఓడించారు 45 ఏళ్ల మహమ్మద్ ముయిజ్జు.