Maldives India Tourism : ద్వైపాక్షిక సంబంధాల క్షీణత మధ్య మాల్దీవులను సందర్శించే భారత పర్యటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో పూర్తిగా పర్యటకంపై ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ అభ్యర్థించారు. ఇరు దేశాల మధ్య బంధం చారిత్రకమైనదని గుర్తుచేస్తూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
"మనకు ఒక చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్‌తో కలిసి పనిచేయాలని అనుకుటుంది. మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా భారతీయులకు ఘన స్వాగతం పలుకుతుంది. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను" అని ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌లోని లక్షద్వీప్ దీవులను సందర్శించారు. అక్కడి పర్యటక అద్భుతాలను హైలైట్ చేస్తూ ఫొటోలు, వీడియోలు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై అక్కసును వెళ్లగక్కుతూ భారత్ సహా ప్రధానిపై మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియా వేదికగా నోరుపారేసుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. మరోవైపు చైనా అనుకూలుడైన ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపాలని నిర్ణయించటం వల్ల సంబంధాలు మరింత క్షీణించాయి.