US Elections 2024 Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అటు డెమోక్రాట్లు, ఇటు రిపబ్లికన్ల మధ్య ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాటుకు గురికావడం, ఆయన ఒకరి పేరుకు బదులు మరొకరి పేరును ప్రసంగాల్లో సంబోధిస్తుండటం, చిత్ర విచిత్ర ప్రదర్శన నేపథ్యంలో సొంత పార్టీ నేతల నుంచే ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక కొందరు డెమోక్రాట్లు అయితే పోటీ నుంచి బైడెన్ తప్పుకుని వేరేవారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసోసియేటెడ్ ప్రెస్-నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ (ఏపీ-ఎన్ఓఆర్సీ) తాజాగా నిర్వహించిన సర్వేలో జో బైడెన్‌కు బదులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను అధ్యక్ష బరిలోకి నిలపడం మంచిదని డెమోక్రాట్లు భావిస్తున్నట్లు తేలింది. డెమోక్రాట్లలో ఎక్కువ మంది కమలవైపే మొగ్గు చూపారు.
10 మందిలో ఆరుగురు ఆమెకే జై!
ప్రతి 10 మంది డెమోక్రాట్లలో ఆరుగురు కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని సమర్థించారు. ఇద్దరు ఆమెకు మద్దతు తెలపకపోగా, మరో ఇద్దరు తమకు తెలియదని చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్-నేషనల్ ఒపీనియన్ రీసెర్చ్ సెంటర్ సర్వే తెలిపింది. ట్రంప్‌తో లైవ్ డిబేట్లో తేలిపోవడం, పలుచోట్ల గందరగోళానికి గురవ్వడం వంటి కారణాలతో జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు ప్రత్యామ్నాయంగా కమలా హ్యారిస్ వైపు డెమోక్రాట్లు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ట్రంప్‌నకు పోటీగా కమలను బరిలోకి దింపాలని భావిస్తున్నారు.