Korean Countries Balloons War: ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చెత్త బెలూన్ల యుద్ధం మరింత ముదిరింది. ఉత్తర కొరియా మళ్లీ పంపిన చెత్త బెలూన్లు సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయం ప్రాగణంలో పడ్డాయని ఆ దేశ మీడియా సంస్థ పేర్కొంది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా, బెలూన్లు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అవి సరిహద్దు దాటిన తర్వాత సియోల్‌కు ఉత్తరంగా ఎగిరాయని పేర్కొంది. బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయితే ఈ 'చెత్త' దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా తెలిపింది.
మే నెల చివరి వారం నుంచి ఈ బెలూన్ల యుద్ధం రెండు దేశాల మధ్య సాగుతోంది. ఉత్తర కొరియా ఇలా బెలూన్లు పంపడం ఇది పదో సారి అని దక్షిణ కొరియా సైన్యం చెప్పింది. ఇప్పటి వరకు 2,000 కంటె ఎక్కువగానే బెలూన్లను ప్రయోగించినట్లు తెలిపింది. ఆ బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉన్నాయని వెల్లడించింది. అయితే దక్షిణకొరియా పంపిన బెలూన్లకు ప్రతీకారంగానే చెత్త బెలూన్లను పంపడం మళ్లీ ప్రారంభించామని ఉత్తర కొరియా పేర్కొంది.
లౌడ్‌స్పీకర్లతో సమాధానం
కొత్త కొరియా చెత్త బెలూన్లకు గతంలో దక్షిణ కొరియా గట్టి జవాబునిచ్చింది. సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను ప్రారంభించింది. సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా K-పాప్ సంగీతం, విదేశీ వార్తలతోపాటు, ప్యాంగ్యాంగ్ వ్యతిరేక ప్రసారాలను దక్షిణ కొరియా సైన్యం హోరెత్తిస్తోంది. ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు, K-పాప్ సంగీత శ్రవనాన్ని తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. అవి తమ పౌర సమాజంలో ప్రభుత్వ వ్యతిరేక భావాలను నాటుతుందని, తన అధికారాన్ని బలహీనపరుస్తుందని నియంత కిమ్ జోంగ్ ఉన్ భావిస్తారు. 2015లో ఇలాగే దక్షిణ కొరియా లౌడ్ స్పీకర్లతో ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారం చేయగా ప్రతిచర్యగా కిమ్ ప్రభుత్వం ఫిరంగులను పేల్చింది. అప్పట్లో అది ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది. మళ్లీ ఆ పరిస్థితులే ఎదురైతే ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించారు.
ట్రంప్ అటాక్ ఎఫెక్ట్- 'సీక్రెట్ సర్వీస్' డైరెక్టర్ రాజీనామా
గ్రామాన్ని ముంచెత్తిన బురద- పిల్లలు, గర్భిణీలు సహా 157 మంది బలి