Keir Starmer Takes Charge As UK PM :యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) 58వ ప్రధానిగా కియర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఫలితాలు వెలువడిన తర్వాత యూకే ప్రధానమంత్రిగా కియర్ నియమితులయ్యారు. అనంతరం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో కింగ్ ఛార్లెస్3ను స్టార్మర్ కలిశారు. కియర్ నియామకాన్ని కింగ్ ఛార్లెస్ ఆమోదించారు. ఆయన సమక్షంలో నూతన ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రజలనుద్దేశించి స్టార్మర్ మాట్లాడారు.
'బ్రిటన్‌ను పునర్నిర్మిస్తాం- అర్జెంటుగా పని మొదలు పెడతాం'
"మన దేశం మార్పుకోసం, పునర్నిర్మానం, ప్రజాసేవ చేసే రాజకీయాల పునరాగమనం కోసం నిర్ణయాత్మకంగా ఓటు వేసింది. మా ముందు ఉన్న పని చాలా అత్యవసరం, ఈరోజే ప్రారంభింస్తాము. ప్రజలు చేసిన త్యాగాలకు, రాజకీయ నాయకుల నుంచి వారు పొందుతున్న సేవలకు మధ్య ఇంత పెద్ద అంతరం పెరిగినప్పుడు, దేశంలో నిస్పృహకు దారితీస్తుంది. మంచి భవిష్యత్తుపై ఆశ, నమ్మకం హరించుకుపోతుంది. అయితే ఇప్పుడు మనం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని మాటలతో కాదు, చేతలతోనే తొలగించొచ్చు. మీ ప్రభుత్వం దేశంలోని (బ్రిటన్) ప్రతి ఒక్క పౌరుడిని గౌరవంగా చూస్తోంది. మీరు నిన్న లేబర్ పార్టీకి ఓటు వేస్తే, మన దేశాన్ని పునర్నిర్మించడానికి బాధ్యత వహిస్తాము. కానీ మీరు లేబర్‌కు ఓటు వేసినా, వేయకపోయినా, ముఖ్యంగా మీరు చేయకపోయినా నా ప్రభుత్వం మీకు సేవ చేస్తుంది. దేశం ముందు తర్వాతే పార్టీ అన్నట్లుగా మా పరిపాలన ఉంటుంది. మార్పుకు సంబంధించిన పని వెంటనే మొదలవుతుందనడంలో సందేహం లేదు. బ్రిటన్‌ను పునర్నిర్మిస్తాం అనడంలో సందేహం లేదు. ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ అవకాశాల మౌలిక సదుపాయాలను పునర్నిర్మిస్తాము.' కియర్ స్టార్మర్ అని అన్నారు.
రిషి సునాక్ ఘనతను తక్కువగా అంచనా వేయకూడదు : స్టార్మర్
ఈ సందర్భంగా యూకే మాజీ ప్రధాని రిషి సునాక్‌ను కూడా కియర్ స్టార్మర్ ప్రశంసించారు. 'మన దేశం(యూకే) మొదటి బ్రిటిష్ ఆసియా ప్రధానిగా ఆయన(రిషి సునాక్) సాధించిన ఘనత, ఆయన చేసిన అదనపు కృషిని ఎవరూ తక్కువగా అంచనా వేయకూడదు. దానికి ఈరోజు మేము ట్రిబ్యూట్ ఇస్తున్నాము. ఆయన అంకితభావాన్ని, కృషిని గుర్తించాము' అని అభినందించారు స్టార్మర్.
స్టార్మర్, సునాక్‌పై మోదీ స్పెషల్ ట్వీట్స్
బ్రిటన్ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న కియర్ స్టార్మర్‌ను అభినందిస్తూ సామాజిక మాధ్యమంలో ప్రధాని మోదీ పోస్టు చేశారు. అన్ని రంగాల్లో భారత్-యూకే సంబంధాల బలోపేతం దిశగా నిర్మాణాత్మక సహకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన రిషి సునాక్‌ను ప్రశంసిస్తూ, ప్రధాని మోదీ మరో పోస్టు చేశారు. యూకేను పాలించడంలో సునాక్ అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు అభినందించారు. రెండు దేశాల మధ్య బలమైన బంధం నెలకొల్పే దిశగా చొరవ చూపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు ప్రయాణం బాగుండాలని ఆకాంక్షిస్తూ సునాక్‌తో పాటు ఆయన కుటుంబానికి ప్రధాని మోదీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.