Kamala Harris Interview Today: అమెరికన్ ప్రజలు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని డెమోక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కమలా హారిస్ తొలి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై కమల తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దేశం కోసం కొత్త మార్గాన్ని నిర్దేశించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సుదీర్ఘకాలంగా తాను అవలంబిస్తున్న ఉదారవాద విలువలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని తేల్చి చెప్పారు.
తాను అధికారంలోకి వస్తే కేబినెట్‌లోకి రిపబ్లికన్‌ను తీసుకుంటానని హారిస్ ప్రకటించడం గమనార్హం. అధ్యక్షురాలిగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ చమురు వెలికితీతను నిషేధించబోనని స్పష్టం చేశారు. చమురు వెలికితీత, వలసవిధానం విషయంలో తనపై వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. ఒకప్పుడు చమురు వెలికితీతను తప్పుబట్టారని అక్రమ వలసలపై ఉదారంగా వ్యవహరించారనడంలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని కమలా హారిస్ ప్రకటించారు. చమురు, సహజవాయువు వెలికితీతకు మద్దతునిస్తానని వెల్లడించారు.
గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని కమలా ఆకాంక్షించారు. మిత్ర దేశమైన ఇజ్రాయెల్ విషయంలో అధ్యక్షుడు బైడెన్ విధానాలనే తాను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగిస్తానన్నారు. ట్రంప్ అమెరికన్లను, వారి శక్తిసామర్థ్యాలను తక్కువ చేసే అజెండాతో పని చేస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని విభజిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కమలా తెలిపారు.
అటు కమలా ఇంటర్వ్యూపై ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. కమలా హారిస్ ఇంటర్వ్యూ బోరింగ్‌గా ఉన్నట్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆరోపించారు. కమలా ఇచ్చిన వాగ్దానాలతో అమెరికా వేస్ట్ ల్యాండ్‌గా మారుతుందని విమర్శించారు. అంతకుముందు సవన్నాలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే జాతీయ గర్భస్రావ నిషేధ బిల్లుపై సంతకం చేస్తారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కోసం మనం పోరాడుతున్నామని ప్రతి ఒక్కరికి వారి గొంతుకను వినిపించే హక్కు ఉందన్నారు.