Joe Biden Latest Interview :ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తనకు వచ్చిందని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అధ్యక్ష ఎన్నికలతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. 1972లో జరిగిన ఓ కారు యాక్సిడెంట్లో జో బైడెన్ మొదటి భార్య, కుమార్తె కన్నుమూశారు. అది జరిగాక తర్వాత ఆయన మానసికంగా కుంగిపోయారట.
"ఆ సమయంలో మద్యానికి అలవాటుపడ్డాను. అప్పటి వరకు నాకు ఆ ఆలవాటు లేనే లేదు. బ్రిడ్జి మీదకు వెళ్లి, దూకాలన్న ఆలోచనలు నన్ను ఎంతగానో వెంటాడేవి. అప్పుడు నాకు వెంటనే నా ఇద్దరు కుమారులు గుర్తొచ్చేవారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు ఎప్పుడూ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఆ యాక్సిడెంట్ తర్వాత తన ఇద్దరు పిల్లల సంరక్షణను ఒంటరిగా చూసుకున్నారు బైడెన్.
ఆ తర్వాత కొద్ది కాలానికి ఆయనకు జిల్‌తో పరిచయం ఏర్పడింది. 1975లో ఈ ఇద్దరూ తొలిసారి కలిశారు. ఆ సమయంలో జో వయసు 33. అప్పుడు ఆయన సెనేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు 24 ఏళ్ల జిల్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని. వారిద్దరి పరిచయానికి జో సోదరుడు కారణమయ్యారు. "ఒక రోజు నా సోదరుడు ఫోన్ చేసి జిల్ గురించి చెప్పాడు. ఆమె చక్కగా ఉంటుంది. కానీ రాజకీయాలను ఇష్టపడదు" అని తెలిపారు. 1977లో జిల్, జో వివాహం జరిగింది.