Israel Hamas Ceasefire Deal :ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఆదివారం పలువురు బందీలను హమాస్ విడుదల చేయనుంది. ఇందుకు బదులుగా వందలాది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. అందుకోసం ఓ జాబితాను కూడా ఇజ్రాయెల్ ప్రచురించింది. ఇందులో హమాస్ అత్యంత కీలకంగా భావించే మార్వాన్ బర్ఘౌటి పేరు ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. భవిష్యత్తులో పాలస్తీనాకు బర్ఘౌటి అధ్యక్షుడవుతారనే ప్రచారం ఉండటం వల్ల ఇజ్రాయెల్ ఏ నిర్ణయం తీసుకుని ఉంటుందనేది ఆసక్తిగా మారింది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం కుదిరిన ఈ ఒప్పందానికి శనివారం ఆమోదం తెలిపింది. దీంతో 15 నెలలుగా సాగిన యుద్ధం ముగియనుంది. హమాస్ ,ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ 24 గంటల్లోపు అమల్లోకి వస్తుందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని చెప్పింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల ఆదేశాల కోసం వేచి ఉండాలని సూచించింది.
ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు?
ఒప్పందంలో భాగంగా వచ్చే ఆరు వారాల వ్యవధిలో 33 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయనుంది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైలులో ఖైదీలుగా ఉన్న వందలాది పాలస్తీనా పౌరులను నెతన్యాహు ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హమాస్ అదుపులో ఉన్న బందీలలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారనేది ప్రశ్నార్థకం. ఇక విడుదల చేయబోయే బందీలు ఎవరు, వారి పేర్లు ఎంటనేవి తెలియాల్సి ఉంది. అయితే ఒప్పందంలో భాగంగా తొలిరోజు ముగ్గురు మహిళలను విడిచిపెడతామని హమాస్ చెబుతోంది. ఏడో రోజు నలుగురిని, మిగిలిన 26 మందిని తర్వాతి ఐదు వారాల్లో విడిచిపెడతామని పేర్కొంది.