తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు - ఓ గర్భిణి, చిన్నారులు సహా 13 మంది మృతి - ISRAELI STRIKES IN GAZA

గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ - రెండు వేర్వేరు దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 13 మంది మరణం

Israeli strikes in Gaza
Israeli strikes in Gaza (AP)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 5:05 PM IST

Israeli Strikes In Gaza :గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ శనివారం జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో 13 మంది మరణించినట్లు పేర్కొన్నారు.

స్కూల్​పై దాడి
గాజాలోని తూర్పు తుఫా పరిసరాల్లోని తాత్కాలిక శిబిరంగా ఉన్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో ఇద్దరు స్థానిక జర్నలిస్టులు, ఓ గర్భిణి, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొంది. అయితే, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూప్​నకు చెందిన ఉగ్రమూకలే లక్ష్యంగా తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించడం గమనార్హం.

అలాగే ఖాన్ యూనిస్​లో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న స్థావరంపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరపగా ఏడుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. మరోవైపు, ఆహారం, నీరు, వైద్య సామగ్రితో కూడిన 11 ట్రక్కులు గాజాకు చేరుకున్నాయి. మానవతా సాయం కింద ఇజ్రాయెల్ సైనిక సంస్థ కొగొట్ (COGAT) వీటిని పంపింది.

ఇప్పటి వరకు 43,000 మంది మృతి
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం ప్రారంభం అయినప్పటీ నుంచి అనేక పాఠశాలలు, శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. భీకర దాడులు జరుపుతోంది. దీంతో చిన్నారులు, మహిళలు సహా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది జులైలో ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో 43,000 మందికి పైగా మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అందులో సగానికిపైగా మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొన్నారు.

తప్పుకున్న గలాంట్‌
ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి పదవి నుంచి శుక్రవారం యోవ్‌ గలాంట్‌ అధికారికంగా తప్పుకున్నారు. గలాంట్​ను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ మంగళవారం ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి టెల్‌ అవీవ్​లోని ప్రధాన వీధుల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇజ్రాయెల్‌ జెండాలతో నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. బందీల విడుదలకు నెతన్యాహు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నిరసనకారులు విమర్శలు చేశారు. కాగా, గలాంట్‌ స్థానంలో రక్షణ మంత్రిగా ఇజ్రాయెల్​ కాట్జ్‌ బాధ్యతలు స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details