Putin On Russia Ukraine War : ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఇందుకోసం ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాత్రం మాట్లాడే ప్రసక్తి లేదని పుతిన్ స్పష్టం చేశారు. ఆ దేశ పార్లమెంటుతో మాత్రమే తాము చర్చలు జరుపుతామని చెప్పారు.
'భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నాం'
అయితే ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదికి వాయిదా పడ్డాయని తెలిపారు. జెలెన్‌స్కీని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని అన్నారు. గురువారం పుతిన్ నాలుగున్నర గంటల పాటు సాగిన వార్షిక విలేకరుల సమావేశంలో వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తాము విజయానికి చేరువలో ఉన్నామని తెలిపారు. తమ దళాలు రోజుకొక చదరపు కిలోమీటర్ భూభాగాన్ని ఆక్రమిస్తూనే ఉన్నామని పుతిన్ చెప్పారు. తాము చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ విజయవంతమవుతోందని అన్నారు.
'ట్రంప్‌ను కలవడానికి నేను సిద్ధం'
మరోవైపు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో నాలుగేళ్లుగా తాను మాట్లాడలేదని అయితే ఆయన్ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ చెప్పారు. అంతకుముందు అగ్రరాజ్యానికి కాబోయే అధ్యక్షుడిపై రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. ఆయన తెలివైన రాజకీయ నేత అని అన్నారు. అయితే, ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్న పుతిన్, ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తుచేసుకున్నారు.
"అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌పై పోరాడేందుకు కొందరు అనాగరిక పద్ధతులు పాటించారు. ఆయన కుటుంబాన్ని, పిల్లలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం దిగ్భ్రాంతి కలిగించింది. ఒకటికంటే ఎక్కువసార్లు ఆయనపై హత్యాయత్నాలు జరగడం విచారకరం. నా ఆలోచన ప్రకారం ఇప్పుడు ట్రంప్ ఏమాత్రం సురక్షితంగా లేరు. అయితే ఆయన తెలివైన వ్యక్తి. ముప్పును అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉంటారని విశ్వసిస్తున్నా" అని పుతిన్ తెలిపారు.