తెలంగాణ

telangana

ETV Bharat / international

స్కూల్‌ టార్గెట్​గా గాజాలో దాడులు- 22 మంది మృతి - Israel Gaza War

Israel Gaza War Update : గాజా సిటీలో ఓ స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. అక్కడ ఆశ్రయం పొందుతున్నవారిలో 22 మంది మృతి చెందినట్లు గాజా అధికారులు వెల్లడించారు.

Israel Gaza War
Israel Gaza War (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 10:18 PM IST

Israel Gaza War Update : ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకరపోరు జరుగుతోంది. దక్షిణ గాజా సిటీలో శనివారం జరిపిన ఇజ్రాయెల్ దాడిలో 22 మంది మృతిచెందారు. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం 22 మంది మరణించారని పాలస్తీనియన్లు తెలిపారు. అయితే, ఇజ్రాయెల్ మిలిటరీ హమాస్ కమాండ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు పేర్కొన్నారు.

ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 13 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు ఉన్నారని హమాస్ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పాత పాఠశాల కాంపౌండ్‌లో హమాస్ కమాండ్ సెంటర్‌ను తాకినట్లు సైన్యం తెలిపింది. సైనిక అవసరాల కోసం పౌర సౌకర్యాలను ఉపయోగిస్తుందనే ఆరోపణలను హమాస్ తీవ్రంగా ఖండించింది.

మరోవైపు, లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడుల్లో కనీసం 31 మంది మృతి చెందారు. వారిలో మరో సీనియర్ కమాండర్ ఉన్నాడని తాజాగా హెజ్‌బొల్లా వెల్లడించింది. గత అక్టోబర్ నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు హెజ్‌బొల్లా ప్రత్యేక దళం రద్వాన్‌కు సంబంధించిన మిలిటరీ కార్యకలాపాలను పర్యవేక్షించిన అహ్మద్ మహ్మద్‌ వాహ్బీ, ఇజ్రాయెల్ దాడిలో చనిపోయినట్లు హెజ్‌బొల్లా తెలిపింది. మంగళ, బుధవారాల్లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో హెజ్‌బొల్లా శ్రేణుల్లో వణుకు పుట్టించిన ఇజ్రాయెల్‌ శుక్రవారం క్షిపణులతో విరుచుకుపడింది. మృతుల్లో హెజ్‌బొల్లా నం.2 నేత ఇబ్రహీం అకీల్ ఉన్నాడని బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం చెప్పింది.

అకీల్‌పై అమెరికా 80ల్లోనే ఆంక్షలు విధించింది. 1983లో బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో ఈ సైనిక కమాండర్‌ కీలక పాత్ర పోషించారు. అకీల్‌ ఆచూకీ తెలిపితే 7 మిలియన్‌ డాలర్లిస్తామని కూడా అగ్రరాజ్యం ప్రకటించింది. ఇప్పుడు అకీల్‌ హతమైన దహియా ప్రాంతంలోనే హెజ్‌బొల్లా సీనియర్‌ కమాండర్‌ ఝక్ర్‌ను జులైలో ఇజ్రాయెల్‌ మట్టుబెట్టడం గమనార్హం. అకీల్ మృతిని హెజ్‌బొల్లా ధ్రువీకరించలేదు.

ABOUT THE AUTHOR

...view details