Israel Palestine Attack Today : ఇద్దరు బందీలను కాపాడేందుకు దక్షిణ గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 67 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని రఫా ఆస్పత్రి అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని చెప్పారు. అంతకుముందు, యుద్ధంలో తొలిసారిగా హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిలో ఇద్దరిని ఇజ్రాయెల్ సైన్యం కాపాడింది. రఫా నగరంలో అర్ధరాత్రి చేపట్టిన ఆపరేషన్‌లో వారిని రక్షించినట్లు సోమవారం తెల్లవారుజామున ఐడీఎఫ్ ప్రకటించింది.
"రఫాలో ఐడీఎఫ్, ఐఎస్‌ఏ (షిన్‌బెట్ సెక్యూరిటీ ఏజెన్సీ), పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఫెర్నాండో సిమోన్ మార్మన్ (60), లూయీస్ హర్ (70)ను హమాస్ చెర నుంచి కాపాడాం. వీరిని గతేడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు నిర్ యిత్జక్ కిబుట్జ్ నుంచి కిడ్నాప్ చేశారు" అని సైన్యం తెలిపింది. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొంది.
ప్రాణాలు కోల్పోయిన 30 మంది
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ దాదాపు 250 మందిని బంధించింది. ఆ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వీరిలో కొంతమందిని విడుదల చేశారు. ఇంకా 136 మంది హమాస్ చెరలో ఉండగా వీరిలో ఇద్దరిని ఇజ్రాయెల్ కాపాడింది. అయితే, బందీల్లో దాదాపు 30 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
వ్యతిరేకిస్తున్న పలు దేశాలు
మరోవైపు, దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేయడాన్ని పలు దేశాలు తప్పుబడుతున్నాయి. గాజాలో దాడులు ప్రారంభమైన తర్వాత లక్షల మంది రఫాకు నిరాశ్రయులుగా వెళ్లి తలదాచుకుంటున్నారు. అక్కడా దాడులు ప్రారంభం కావటం వల్ల సామాన్య పౌరులు కలవరపడుతున్నారు. దీంతో ఈజిప్టు, ఖతార్, సౌదీ సహా పలు దేశాలు ఈ దాడులను ఖండించాయి. అటు అమెరికా కూడా దీన్ని వ్యతిరేకించింది.
ఐడీఎఫ్ సంచలన ఆరోపణలు
ఓ ప్రముఖ మీడియా సంస్థలో పనిచేస్తున్న పాలస్తీనా జర్నలిస్టు హమాస్ ముఠాలో కీలక సభ్యుడని ఐడీఎఫ్ సంచలన ఆరోపణలు చేసింది. ఉత్తర గాజాలో జరిపిన భూతలదాడుల్లో భాగంగా తాము సేకరించిన ల్యాప్‌టాప్, పత్రాల్లో లభించిన సమాచారంతో ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా ఆ పత్రిక ప్రసారాల్లో విరివిగా కన్పించిన ఆ జర్నలిస్టు.. హమాస్‌కు చెందిన యాంటీ ట్యాంక్ మిసైల్ యూనిట్ సీనియర్ కమాండర్ అని వెల్లడించింది.