Israel Iran War: ఇరాన్‌పై ప్రతీకార దాడి ఎప్పుడు, ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ విషయంలో మిత్ర దేశాల సూచనలను తాము పట్టించుకోమని పేర్కొన్నారు. బుధవారం కేబినెట్ సహచరులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నియంత్రణ పాటించాలి
ఇరాన్‌పై దాడి చేయాలన్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ తీసుకుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన టెల్ అవీవ్ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆయన బెంజమిన్ నెతన్యాహును కలిశారు. ఈ సందర్భంగా దాడి విషయాన్ని కామెరూన్‌కు నెతన్యాహు చెప్పినట్లు తెలిపారు. 'ఇరాన్‌పై స్పందించాలని ఇజ్రాయెలీలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచకుండా తెలివిగా, బలంగా స్పందించాలని మేం చెప్పాం' అని కామెరూన్ అన్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. జర్మనీ విదేశాంగ మంత్రి బేర్‌బాక్ కూడా టెల్‌అవీవ్‌లోనే ఉన్నారు. 'అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నియంత్రణ పాటించాలి. ఇప్పటికే ఇరాన్ దాడిని అడ్డుకొని ఇజ్రాయెల్ విజయం సాధించింది' అని బేర్‌బాక్ అన్నారు.
తీవ్ర పరిణామాలు తప్పవు
కాగా తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్‌ను ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదని పేర్కొన్నారు. వార్షిక సైనిక పరేడ్‌లో ఈ మేరకు మాట్లాడారు. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు, నలుగురు పౌరులు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా లెబనాన్‌లోని బాల్బెక్ జిల్లాలో దాడులకు దిగామని ఇజ్రాయెల్ వెల్లడించింది. లాట్ పట్టణానికి సమీపంలో ఈ దాడి జరిగిందని ప్రకటిచింది.