Israel Gaza Ceasefire : గాజా పట్టీపై జరుగుతున్న దాడుల్ని ఆపేసి సంపూర్ణ కాల్పుల విరమణ పాటిస్తేనే బందీల విడుదల ఒప్పందానికి తాము అంగీకరిస్తామని ఇజ్రాయెల్‌కు హమాస్ స్పష్టం చేసింది. అయితే ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తూ హమాస్ డిమాండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఇజ్రాయెల్ తెగేసి చెబుతోంది. దీంతో యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో పరిష్కారం అయ్యే సూచనలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు.
'మా పౌరులపై ఇజ్రాయెస్ చేస్తున్న దాడుల్ని వెంటనే ఆపేయాలి. అంతేకాకుండా విస్తృత, సమగ్ర కాల్పుల విరమణను పాటించాలి. గాజా పునర్నిర్మాణాన్ని చేపట్టాలి. ఇజ్రాయెల్ జైళ్లలో బందీలుగా ఉన్న పాలస్తీనా ఖైదీలను తక్షణమే విడుదల చేయాలి. వీటికి అంగీకరిస్తేనే మేం ఒప్పందాన్ని సానుకూలంగా స్వీకరిస్తాం' అని హమాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెలీల విడుదల కోసం అమెరికా, ఖతార్ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో హమాస్ మిలిటెంట్లు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖతార్ ప్రధాని భిన్న ప్రకటన
ఒకవైపు హమాస్ మిలిటెంట్లు సంపూర్ణ కాల్పుల విరమణ పాటిస్తేనే తప్ప బందీల విడుదల ఒప్పందానికి అంగీకరించబోమని తేల్చిచెప్పిన నేపథ్యంలో దీనిపై భిన్న ప్రకటన చేశారు ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహమాన్ అల్ థానీ. గాజా పట్టీపై సంపూర్ణ కాల్పుల విరమణ ప్రతిపాదన అంగీకారానికి హమాస్ గ్రూప్ సానుకూలంగా ఉందని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో చెప్పారు.
'ఖాళీ చేసి వెళ్లిపోండి'
Gaza Strip Conflict :గతేడాది అక్టోబరు 7న హమాస్ దాడులతో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా గాజాపై ఎదురుదాడులకు దిగుతోంది. ఇందులో భాగంగా పాలస్తీనీయులు తమ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశిస్తోంది. గాజా భూభాగంలో 246 చ.కి.మీల మేర ప్రాంతంలో ప్రస్తుతం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని ఐరాస మానవతా వ్యవహారాల సంస్థ వెల్లడించింది. యుద్ధం ప్రారంభానికి ముందు ఇక్కడ 17 లక్షల మంది ఉండేవారని, మొత్తం జనాభాలో వీరు 77 శాతమని పేర్కొంది.