Indonesia Admitted To BRICS Bloc : అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడిన ‘బ్రిక్స్’ కూటమిలో ఇండోనేషియాకు పూర్తిస్థాయి సభ్యత్వం మంజూరైంది. ప్రస్తుతం బ్రిక్స్‌కు సారథ్యం వహిస్తున్న బ్రెజిల్ దేశం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్‌లో ఇండోనేషియాకు పూర్తిస్థాయి సభ్యత్వం కల్పించే ప్రతిపాదనకు 2023 ఆగస్టులోనే కూటమిలోని దేశాలు ఆమోదం తెలిపాయని వెల్లడించింది. ఇండోనేషియా అనేది జనాభాపరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం. గతేడాది అక్కడ ఏర్పాటైన ప్రభుత్వం బ్రిక్స్ కూటమిలో చేరాలని నిర్ణయించింది. ఆ మేరకు ఆసక్తిని కనబరుస్తూ బ్రిక్స్‌కు దరఖాస్తును సమర్పించింది. ‘‘బ్రిక్స్ కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వం కలిగిన దేశంగా మారిన ఇండోనేషియాకు మేం స్వాగతం పలుకుతున్నాం. అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండోనేషియాకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రపంచ సుపరిపాలనలో సంస్కరణలకు ఈ కూర్పు దోహదం చేస్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండోనేషియా ఉంది. దక్షిణ అమెరికాలోని దేశాలతో, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలతో సంబంధాల బలోపేతానికి ఈ పరిణామం దోహదం చేస్తుంది’’ అని పేర్కొంటూ బ్రెజిల్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.
బ్రిక్స్‌లో ఇండోనేషియాకు పూర్తిస్థాయి సభ్యత్వం - స్వయంగా ప్రకటించిన బ్రెజిల్ - INDONESIA ADMITTED TO BRICS BLOC
బ్రిక్స్‌లో ఇండోనేషియాకు పూర్తిస్థాయి సభ్యత్వం - కూటమి సారధ్య హోదాలో ప్రకటించిన బ్రెజిల్
Published : Jan 7, 2025, 8:53 AM IST
2009 సంవత్సరంలో మొదలై
బ్రిక్స్ కూటమిని 2009 సంవత్సరంలో భారత్, చైనా, బ్రెజిల్, రష్యా దేశాలు కలిసి ప్రారంభించాయి. 2010 సంవత్సరంలో అందులోకి దక్షిణాఫ్రికా చేరింది. 2024 సంవత్సరంలో ఈ కూటమిలోకి ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ చేరాయి. సౌదీ అరేబియా కూడా బ్రిక్స్‌లో చేరేందుకు ఆసక్తిగా ఉంది. బ్రిక్స్‌లో తమను కూడా చేర్చుకోవాలంటూ టర్కీ, అజర్ బైజాన్, మలేషియా సహా పలు దేశాలు దరఖాస్తులు సమర్పించాయి.
ఇక ప్రపంచ జనాభాలో 45 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం
అభివృద్ధి చెందిన దేశాల కూటమి గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) నమూనాలో అభివృద్ధి చెందుతున్న దేశాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేశారు. 2050 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటాను చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో బ్రిక్స్ కూటమి ముందుకు సాగుతోంది. తాజాగా అత్యధిక జనాభా కలిగిన ఇండోనేషియా చేరికతో బ్రిక్స్ కూటమి మరింత బలోపేతమైంది. ప్రపంచ జనాభాలో దాదాపు 45 శాతం మంది ఇప్పుడు బ్రిక్స్ కూటమి దేశాల పరిధిలోకి వచ్చారు. జనసంఖ్య, కొనుగోలు శక్తి ప్రాతిపదికన ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో దాదాపు 35 శాతం వాటాను బ్రిక్స్ కూటమి దేశాలే అందిస్తున్నాయి.