తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 10:57 AM IST

Updated : Jan 30, 2024, 11:08 AM IST

ETV Bharat / international

పాకిస్థాన్ నావికులను కాపాడిన భారత్- 36 గంటల వ్యవధిలో నేవీ సెకండ్ ఆపరేషన్

Indian Navy rescues : 19 మంది పాకిస్థానీ నావికులను భారత నౌకా దళం రక్షించింది. సోమాలియాకు చెందిన సముద్రపు దొంగల బారి నుంచి కాపాడింది. 36 గంటల వ్యవధిలో భారత నావికాదళం రెండు ఆపరేషన్లు చేసి సత్తా చాటింది.

Indian Navy rescue
Indian Navy rescue

Indian Navy rescue : సముద్రపు దొంగల బారి నుంచి 19 మంది పాకిస్థాన్​కు చెందిన నావికులను కాపాడింది భారత నౌకాదళం. సోమాలియా తూర్పు తీరంలో సోమవారం చేపల వేటకు వెళ్లిన అల్ నయీమి నౌకను 11 మంది సముద్రపు దొంగలు చుట్టుముట్టారు. ఆ సమయంలో నౌకలో 19 మంది పాకిస్థానీ సిబ్బందిని ఉన్నారు. తమను రక్షించమని భారత నావికాదళానికి అత్యవసర సందేశం రావటం వల్ల యుద్ధనౌక ఐఎన్​ఎస్ సుమిత్రను మరోసారి రంగంలోకి దించింది. కొచ్చి తీరానికి 800 మైళ్ల దూరంలో ఉన్న ఘటనాస్థలికి చేరుకుని సాయుధ సముద్రపు దొంగల నుంచి అల్‌ నయీమి నౌకను కాపాడింది.

ఇరాన్ జెండాతో వెళ్తున్న అల్ నయీమి బోటులోని సిబ్బందిని సురక్షితంగా రక్షించేందుకు భారత నావికాదళానికి చెందిన మెరైన్ కమాండోలు రంగంలోకి దిగారు. యుద్ధ హెలికాప్టర్ల ద్వారా నౌకలోకి ప్రవేశించి సొమాలియా సముద్రపు దొంగల చెరలో ఉన్న 19 మంది బందీలను విడిపించారు. 36 గంటల్లో భారత నావికాదళం చేపట్టిన రెండో విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్ ఇది. నౌకలకు భద్రతను కల్పించేందుకు భారత నౌకాదళం యుద్ధనౌకలను హిందూ మహాసముద్రంలో మోహరించింది.

అంతకుముందు భారత నేవీ సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టించింది. కొచ్చి నుంచి దాదాపు 700 నాటికల్‌ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఓ ఇరాన్‌ చేపల బోటు ఇమాన్‌ను కాపాడింది. బందీలుగా చిక్కుకున్న మొత్తం 17 మంది సిబ్బందిని సురక్షితంగా విడిపించింది. హైజాక్‌ సమాచారం అందుకున్న వెంటనే ఏడెన్‌ జలసంధి, సోమాలియా తూర్పు తీరం వెంబడి విధుల్లో ఉన్న 'ఐఎన్‌ఎస్‌ సుమిత్రా' రంగంలోకి దిగింది. బోటును అడ్డుకుని, హెలికాప్టర్ల ద్వారా చుట్టుముట్టి సముద్రపు దొంగలకు హెచ్చరికలు జారీ చేసింది. పడవతో పాటు 17 మంది సిబ్బందిని రక్షించిందని భారత రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో అరేబియా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడుల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. తన సముద్ర గస్తీని భారీ స్థాయిలో పెంచింది. దాడులకు గురవుతున్న విదేశీ నౌకలకు అండగా నిలుస్తోంది.

అరేబియా సముద్రంలో నౌక హైజాక్​- రంగంలోకి INS సుమిత్ర- 17 మంది సేఫ్

Last Updated : Jan 30, 2024, 11:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details